నీటిఎద్దడిని నివారించాలి
⇒ ట్యాంకర్లు, బోర్లు అద్దెకు తీసుకుని సరఫరా చేయాలి
⇒ మండల అధికారులతో జెడ్పీ చైర్మన్ బాలునాయక్ సమీక్ష
నల్లగొండ :
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ తెలిపారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధి కారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా అధిగమించామని, ఈ ఏడాది కూడా అదే విధంగా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఏయే గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గతేడాది అద్దెకు తీసుకున్న బోర్ల పేమెంట్, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి త్వరితగతిన చెల్లిస్తే ఈ ఏడాది బోర్లు అద్దెకు తీసుకోవడానికి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు బోర్లు అద్దెకు తీసుకుని లేదా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేం ద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు పాటించా లన్నారు. ధాన్యం రవాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ పాపారావు పాల్గొన్నారు.