సాగిలాపడింది | avuladatla village story | Sakshi
Sakshi News home page

సాగిలాపడింది

Published Fri, Nov 18 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

సాగిలాపడింది

సాగిలాపడింది

నాడు 400 బోరు బావులు.. నేడు 40!
నాడు 3,200 ఎకరాల్లో పంటల సాగు.. నేడు 200 ఎకరాలు!!


ఇతంటి విపత్కర పరిస్థితిని రైతులు ఈ నాలుగు దశాబ్దాల్లో ఏనాడూ ఎదుర్కోలేదు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోయాయి. పుడమి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయం తప్ప మరో పని చేతకాని బతుకులు ఛిద్రమవుతున్నాయి. గ్రామగ్రామానా ఇదే పరిస్థితి... స్పందించాల్సిన పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పంట సాగు నానాటికీ పడిపోతోంది.


రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామంలో మూడేళ్ల క్రితం 400 వ్యవసాయ బోరుబావులు ఉండేవి. అప్పట్లో దాదాపు 3,200 ఎకరాల్లో మామిడి, సపోట, కళింగర, కర్భూజ, టమాట, దానిమ్మ, ఉల్లి, మొక్కజొన్న, వివిధ కూరగాయలతో పాటు సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. వ్యవసాయ పనుల ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు పనులు కల్పించేవారు. నేడు ఈ పరిస్థితులు తారుమారు అయ్యాయి.

నియోజకవర్గం వ్యాప్తంగా ఇవే పరిస్థితులు
గతంలో 400 బోరు బావులున్న ఆవులదట్ల గ్రామంలో నేడు 40 బోర్లలో మాత్రమే నీరు ఆగిఆగి వస్తున్నాయి. మిగిలినవి పూర్తిగా వట్టిపోయాయి. మండల వ్యాప్తంగా 28 గ్రామాల్లో 4,007 బోరు బావులు ఉండేవి. నియోజకర్గంలోని గుమ్మఘట్ట మండలంలో3,212, డీ హీరేహళ్‌ మండలంలో 3,563, బొమ్మనహాళ్‌ మండలంలో 4,907, కణేకల్లు మండలంలో 5,689 బోరు బావుల్లో గతంలో సమృద్ధిగా నీరు వస్తుండేది. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా 2,849 బోరు బావుల్లో మాత్రమే అరకొరగా నీరు వస్తున్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వేసవి ఆరంభం కాకనే పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఉంటాయోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

700 అడుగులు తవ్వినా లభ్యం కాని నీరు
ఆవులదట్ట గ్రామంలో గతంలో ఉన్న 400 బోరుబావుల్లో 200 అడుగుల నుంచి 350 అడుగుల లోపే భూగర్భజలాలు సమృద్ధిగా లభ్యమయ్యేవి. అప్పటల్లో బోరుబావి తవ్వేందుకు రూ.16 వేల నుంచి రూ. 22వేల వరకు ఖర్చు అయ్యేది. నేడు నాలుగు వందల నుంచి 700 అడుగుల వరకూ తవ్వినా నీటి చుక్క జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజలకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. ఇదే సమయంలో మూగజీవాల పరిస్థితి మరింత దిగజారింది. తాగునీరు లేకపోవడంతో ఈ నాలుగు నెలల్లో 82 పశువులను రైతులు విక్రయించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.  

రెండు బోర్లలోనే నీరు
గతంలో మాకు నాలుగు బోరుబావులు ఉండేవి. 12 ఎకరాలలో మామిడి, దానిమ్మ ఇతర పంటలు సాగుచేశాం. బోరుబావుల్లో నీరు పూర్తిగా ఇంకిపోవడంతో దిక్కు తోచడం లేదు. పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. పంటల సాగు కోసం లక్షలాది రూపాయలను పెట్టుబడుల రూపంలో పెట్టాం. ప్రస్తుతం రెండు బోర్లలో అరకొరగా నీరు వస్తోంది.
- ధర్మానాయక్‌ , రైతు, ఆవులదట్ల గ్రామం

Advertisement

పోల్

Advertisement