ఎన్నిలు ఎరుగని ఊరు!
అక్కడ పదవులన్నీ ఏకగ్రీవమే
ఆదర్శ గ్రామంలో సమస్యల తిష్ట
మౌలిక వసతులు కరువు
ఐదు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు ఎన్నికలు అంటే ఏమిటో... అవి ఎలా ఉంటాయో చూడలేదు! వారి వేలిపై ఎన్నికల సిరా చుక్క పడలేదు. ఈ విషయం విన్న తర్వాత ఆ గ్రామ రాజకీయాలపై ఆసక్తి లేదనుకుంటే మీరు పొరబడినట్లే!! వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఆ గ్రామంలో ఉన్నారు. అంతేకాదండోయ్.. ఆ గ్రామానికి ఓ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎమ్పీటీసీ సభ్యుడు... ఇలా ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా ఏకగ్రీవంగా గ్రామస్తుల ఆమోదంతో ఎంపికైన వారే. ఎన్నికల దుబారా ఖర్చును అరికట్టి ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోతోంది.
ధర్మవరం మండలంలోని వెంకట తిమ్మాపురం పంచాయతీ ఏర్పడి సుమారు 50 సంవత్సరాలు అవుతోంది. ఈ 50 ఏళ్లలో పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏనాడూ ఎన్నికలు జరగలేదు. పార్టీలక అతీతంగా గ్రామస్తులంతా ఏకమై ఓ వ్యక్తిని సర్పంచ్‌గా ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం బాల అరుణమ్మను ఎంపిక చేశారు.
పోటీ ఉత్పన్నమైతే రాజీ మార్గం
గ్రామ సర్పంచ్ పదవి కోసం పోటీ ఉత్పన్నమైతే గ్రామస్తులు చర్చించుకుని ఓ అంగీకార ఒప్పందానికి వస్తారు. ఇలాంటి పరిస్థితి మూడేళ్ల క్రితం ఎదురైంది. అప్పట్లో సర్పంచ్ పదవి కోసం బాల అరుణమ్మ, నాగేంద్రమ్మ పోటీ పడ్డారు. దీంతో గ్రామస్తులు తొలి రెండున్నర సంవత్సరాలు బాల అరుణమ్మకు, మరో రెండున్నర సంవత్సరాలు నాగేంద్రమ్మ ఆ పదవిలో కొనసాగాలని తీర్మానించారు. ఈ అంగీకారంతో సర్పంచ్‌గా బాల అరుణమ్మ, ఉప సర్పంచ్‌గా నాగేంద్రమ్మ నియమితులయ్యారు.
గ్రామ ప్రశాంతతకు టీడీపీ చెక్
రాజకీయ వర్గ కక్షలు ఎలా ఉంటాయో కూడా తెలియని వెంకట తిమ్మాపురంలో టీడీపీ చిచ్చు రగల్చింది. ఇందులో భాగంగానే పదవుల ఒప్పందాన్ని కాదంటూ బాల అరుణమ్మను టీడీపీలో చేర్చుకుని.. ఆమె పదవీ కాలం పూర్తి అయినా రాజీనామా చేయించకుండా అలాగే కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయంలో గ్రామపెద్దలు జోక్యం చేసుకున్నా.. టీడీపీ పెద్దలు కాదని ధిక్కరించారు. ఇటీవల ఆరు నెలల క్రితం బాల అరుణమ్మ ఆకస్మిక మృతి చెందారు. దీంతో ఆ పదవికి ఎన్నికలు చేపట్టేలా అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. గ్రామస్తుల మూకుమ్మడి ఎంపిక ప్రక్రియను కాదంటూ ఈ సారీ ప్రత్యక్ష ఎన్నికలకు పోతుండడంతో అధికారులు నూతన ఓటరు జాబితాను రూపొందించి, ఉన్నతాధికారులకు నివేదించారు.
మౌలిక వసతులు కరువు
పాలకుల ఉదాసీన వైఖరి.. అధికారుల అలసత్వం కారణంగా వెంకటతిమ్మాపురం గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఈ పంచాయతీలో వెంకటతిమ్మాపురం, మాలగుండ్లపల్లి గ్రామాలున్నాయి. పంచాయతీ సభ్యులుగా ఏకగ్రీవ ఎంపిక అయితే ఆ పంచాయతీకి నిధులు పుష్కలంగా వచ్చిపడతాయని, సమస్యలు తీరుతాయనుకున్న గ్రామస్తుల కల.. కలగానే మిగిలిపోయింది. నేటికీ ఈ పంచాయతీ పరిధిలోని ప్రజలు తాగునీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వీధి దీపాలు వెలగవు. గ్రామ వీధులు ముళ్ల పొదలతో విస్తరించి ఉన్నాయి. మురుగు కాల్వలు శుభ్రం చేయరు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.