నగదు రహిత లావాదేవీల జిల్లాగా తీర్చిదిద్దుతాం
అనంతపురం అర్బన్: 'అనంత'ను నగదు రహిత లావాదేవీల జిల్లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. ప్రజలకు నగదు రహిత లావాదేవీల నిర్వహణ, అవగాహన కల్పించేందుకు మంగళవారం ఓటీఆర్‌ఐ నుంచి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, ఈ–వ్యాలెట్, రూపే, డెబిట్ కార్డులు, పీఓఎస్ యంత్రాలను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలన్నారు.
దీంతో నగదు లేని సమస్య తగ్గడమే కాకుండా విలువైన సమయం ఆదా చేసుకోవచ్చన్నారు.కార్డులు ఉపయోగించడం, మొబైల్ బ్యాంకింగ్ సులభరతమే కాకుండా వేగవంతంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేన్‌టీయూ వీసీ సర్కార్, ఆర్‌డీఓ మలోలా, ఎస్‌స్‌ఏ పీఓ దశరథరామయ్య, తహశీల్దారు శ్రీనివాసులు, జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.