CashLess Scheme
-
బార్‌కోడింగ్ కార్డుల ద్వారా రైల్వే టికెట్లు
కరెంట్ బుకింగ్ కౌంటర్లపై పరిశీలిస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత సేవల్లో భాగంగా ప్రీ పెయిడ్ కార్డుల ద్వారా టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కార్డులపై ఉండే బార్ కోడింగ్ ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో ఆ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ కౌంటర్లలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను సమకూర్చి స్వైపింగ్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఇవే యంత్రాలను కరెంట్ బుకింగ్ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తేవాలని ముందుగా నిర్ణయిం చారు. స్వైపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుం డటంతో వాటితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ప్రస్తుతానికి వాటిని అందుబాటులోకి తేవద్దని నిర్ణయించారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన తర్వాత చాలామంది హడావుడిగా వచ్చి టికెట్లు కొంటుంటారు. ఆ సమయంలో స్వైపింగ్ యంత్రాలలో లావాదేవీలు చేయటం వల్ల జాప్యం జరిగి రైళ్లను మిస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లలో స్వైపింగ్ యంత్రాలు సరికాదని అధికారులు నిర్ణయించారు. వీటికి బదులు బార్‌కోడింగ్ ఉండే కార్డుల ద్వారా వేగంగా టికెట్లు జారీ చేయొచ్చని భావిస్తున్నారు. ఇందుకు ప్రజలకు బార్‌కోడింగ్ ఉండే ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నారు. -
నగదు రహిత లావాదేవీల జిల్లాగా తీర్చిదిద్దుతాం
అనంతపురం అర్బన్: 'అనంత'ను నగదు రహిత లావాదేవీల జిల్లా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. ప్రజలకు నగదు రహిత లావాదేవీల నిర్వహణ, అవగాహన కల్పించేందుకు మంగళవారం ఓటీఆర్‌ఐ నుంచి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్, ఈ–వ్యాలెట్, రూపే, డెబిట్ కార్డులు, పీఓఎస్ యంత్రాలను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలన్నారు. దీంతో నగదు లేని సమస్య తగ్గడమే కాకుండా విలువైన సమయం ఆదా చేసుకోవచ్చన్నారు.కార్డులు ఉపయోగించడం, మొబైల్ బ్యాంకింగ్ సులభరతమే కాకుండా వేగవంతంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జేన్టీయూ వీసీ సర్కార్, ఆర్డీఓ మలోలా, ఎస్స్ఏ పీఓ దశరథరామయ్య, తహశీల్దారు శ్రీనివాసులు, జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. -
‘నగదు రహిత వ్యవస్థతో ఇబ్బందులే’
హైదరాబాద్: నగదు రహిత వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించటం ప్రజలను ఇబ్బందులు పెట్టడానికేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో అక్షరాస్యులు కూడా చాలా తక్కువ మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారని ఆయన తెలిపారు. మన దేశంలో క్యాష్‌లెస్ వ్యవస్థకు అనుకూల పరిస్థితులు లేవని పలు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. రోజుల తరబడి కరెంటు కోతలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో క్యాష్‌లెస్ మార్కెట్లు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుపుతున్న దేశాల్లో హ్యాకింగ్, సైబర్ నేరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ అనుభవాలను అధ్యయనం చేయకుండా నగదు రహిత మార్కెట్ అనటం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకునే సొమ్ముకు ప్రభుత్వం భరోసా ఇస్తుందా అని నిలదీశారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు కుప్పకూలిపోతే ఖాతాదారుల పరిస్థితి ఏమిటన్నారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ వ్యవస్థ అమలుపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.