‘నగదు రహిత వ్యవస్థతో ఇబ్బందులే’
హైదరాబాద్: నగదు రహిత వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించటం ప్రజలను ఇబ్బందులు పెట్టడానికేనని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో అక్షరాస్యులు కూడా చాలా తక్కువ మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారని ఆయన తెలిపారు. మన దేశంలో క్యాష్‌లెస్ వ్యవస్థకు అనుకూల పరిస్థితులు లేవని పలు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. రోజుల తరబడి కరెంటు కోతలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో క్యాష్‌లెస్ మార్కెట్లు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు.
డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుపుతున్న దేశాల్లో హ్యాకింగ్, సైబర్ నేరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని వివరించారు. అంతర్జాతీయ అనుభవాలను అధ్యయనం చేయకుండా నగదు రహిత మార్కెట్ అనటం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకునే సొమ్ముకు ప్రభుత్వం భరోసా ఇస్తుందా అని నిలదీశారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు కుప్పకూలిపోతే ఖాతాదారుల పరిస్థితి ఏమిటన్నారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నగదు రహిత వ్యవస్థ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ వ్యవస్థ అమలుపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు.