
నిర్వేదం
–దుస్థితిలో ఆయుర్వేద ఆస్పత్రులు
– 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేని వైనం
– ఇప్పటికే ఆరు మూత
ఆయుర్వేదానికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మన ప్రాచీన వైద్యవిధానం కావడంతో పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా నిర్వహించింది. ఇంతవరకు బాగానే ఉన్నా..జిల్లాలోని ఆయుర్వేద ఆస్పత్రుల పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోంది. వైద్యులు, సిబ్బంది లేకపోవడం, మందుల కొరత తదితర కారణాలతో మూతపడుతున్నాయి.
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 50 ఆయుర్వేద డిస్పెన్సరీలు(ఆస్పత్రులు) ఉన్నాయి. రెగ్యులర్ కింద 28, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద 22 నడుస్తున్నాయి. వీటిలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, ఎస్‌ఎన్‌ఓలు ఉండాలి. అయితే.. ఏ ఆస్పత్రిలోనూ తగినంత మంది సిబ్బంది లేరు. 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బూదిలి, గడేహోతూరు, హావళిగి, నరసింగయ్యగారిపల్లి, పుట్లూరు, విడపనకల్లు, కోడూరు, అచ్చంపేట, ముదిగుబ్బ, రొళ్ల, సొమందేపల్లి, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, నాగసముద్రం గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, యల్లనూరు, ఎర్రగుంట డిస్పెన్సరీలను మెడికల్ ఆఫీసర్ లేకుండానే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేని కారణంగా అగళి, బొమ్మనహాళ్, తాడిమర్రి, శంకరగల్, అమరాపురం, మోరుబాగల్ వైద్యశాలలు మూతపడ్డాయి.
భరోసా లేని బతుకులు
రెగ్యులర్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు సక్రమంగా వస్తున్నా.. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏటా రెన్యూవల్ కోసం పోరాడాల్సిన దుస్థితి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసినా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. రెన్యూవల్ కాకపోవడంతో ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక మానసిక వ్యథ అనుభవిస్తున్నారు.
మందుల సరఫరాకు బ్రేక్
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫార్మసీ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో మందుల సరఫరాకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అరకొరగా వస్తున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నెలకు 1,200 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. అనంతపురంలోని ఆస్పత్రికి రోజూ 60 మంది వరకు వస్తున్నారు. అయితే.. వీటిలో చాలా మందులు అందుబాటులో లేవు. నొప్పులకు వాడే యోగరాజ గుగ్గులు, కాంచనార గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, సింహనాద గుగ్గులు, డయాబెటీస్‌కు వాడే నిసామలకి, బీపీ బాధితులకు ఇచ్చే సర్పగంధతో పాటు జలుబు, కంటి, చెవి సమస్యలు వస్తే వేసే డ్రాప్స్ కూడా లేవు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అటు ప్రజాప్రతినిధులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.