
ఆదేశాలు పాటిస్తే బహుమానం ఇదా ?
♦ వాహనాన్ని వేరో రూటులో వెళ్లాలని చెప్పడంతో
♦ ఏఆర్ ఎస్‌ఐపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం
♦ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
♦ ఎస్‌ఐపై చర్యలకు రంగం సిద్ధం?
పట్నంబజారు (గుంటూరు) : ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం మంత్రి గారి వాహనాన్ని అటువైపు పార్కింగ్‌కు వెళ్లమని చెప్పడం ఆ ఎస్‌ఐ చేసిన నేరం. దీంతో ఆగ్రహించిన సదరు మంత్రిగారు చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 15న మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సీటీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతం వర్షం కారణంగా పూర్తిగా తడిసిపోయింది. దీనితో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ ఎస్‌ఐ వి. బాలకృష్ణ వేరే రూటు ద్వారా లోపలికి వెళ్లాలని సూచించారు.
దీతో అగ్రహం చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన్ను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా పోలీసు ఉన్నతాధికారులకు సైతం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. సుమారు సంవత్సరం పైగా ఎస్‌ఐ బాలకృష్ణ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు నిర్వర్తించారు. నెలన్నర నుంచి ఈస్ట్ ట్రాఫిక్ స్టేషన్‌లో పని చేస్తున్నారు. మంత్రి గారి ఎపిసోడ్ నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఆయన్ను ఏఆర్ కార్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయనపై చర్యలు తీసుకునే దిశగా యోచిస్తున్నారని పోలీసు శాఖలో అనుకుంటున్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించినా ఇదేమి గోలంటూ పోలీసులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.