బాబూ..! ఫ్రీజోన్‌ఫై చర్చకు సిద్ధమా
- ఆర్పీఎస్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
నూనెపల్లె: ఫ్రీజోన్ ప్రకటించామని చెప్పడం కాదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ జనాభా ప్రాతిపదికన 40 శాతం ఇవ్వాలని కోరితే సీఎం చంద్రబాబు బాబు నోరుమెదపడం లేదన్నారు. ఫ్రీజోన్‌పై కొండారెడ్డి బురుజు వేదికగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టణంలోని తెలుగుగంగ అతిథి గృహంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సీమ ప్రజలను చంద్రబాబు చులకనగా చూస్తున్నాడన్నారు. అమరావతి ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ అక్కడివారికే ఇస్తూ సీమ వారిని విస్మరిస్తున్నారన్నారు. అమరావతి పరిధిలో మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారని అందులో కూడా తమ వాటా ఇవ్వాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు.
ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు ధ్వంసం అయితే కంట్రోల్ బ్లాస్టింగ్ కోసం ఉద్యమించామన్నారు. రైతులు, ప్రజల సంక్షేమానికి వెనుకాడే ప్రసక్తి లేదని కేసులు, అరెస్టులకైనా సిద్ధమన్నారు. కృష్ణాబోర్డు ప్రకటించిన నీటి వాటాను వ్యతిరేకిస్తున్నామని, నీటి వాటాలో సీమ ప్రాంతానికి ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. 69 జీఓతో రాయలసీమ రైతులు నష్టపోతారని, జీఓ రద్దుకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. పట్టిసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎలా సస్యశ్యామలం చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఉద్యోగాలపై పీఎం మోడీతో పాటు సీఎం చంద్రబాబుకు మల్టీజోనల్‌పై లేఖ రాస్తే ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు.