freezone
-
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
బాబూ..! ఫ్రీజోన్‌ఫై చర్చకు సిద్ధమా
- ఆర్పీఎస్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నూనెపల్లె: ఫ్రీజోన్ ప్రకటించామని చెప్పడం కాదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ జనాభా ప్రాతిపదికన 40 శాతం ఇవ్వాలని కోరితే సీఎం చంద్రబాబు బాబు నోరుమెదపడం లేదన్నారు. ఫ్రీజోన్‌పై కొండారెడ్డి బురుజు వేదికగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టణంలోని తెలుగుగంగ అతిథి గృహంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సీమ ప్రజలను చంద్రబాబు చులకనగా చూస్తున్నాడన్నారు. అమరావతి ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ అక్కడివారికే ఇస్తూ సీమ వారిని విస్మరిస్తున్నారన్నారు. అమరావతి పరిధిలో మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారని అందులో కూడా తమ వాటా ఇవ్వాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు ధ్వంసం అయితే కంట్రోల్ బ్లాస్టింగ్ కోసం ఉద్యమించామన్నారు. రైతులు, ప్రజల సంక్షేమానికి వెనుకాడే ప్రసక్తి లేదని కేసులు, అరెస్టులకైనా సిద్ధమన్నారు. కృష్ణాబోర్డు ప్రకటించిన నీటి వాటాను వ్యతిరేకిస్తున్నామని, నీటి వాటాలో సీమ ప్రాంతానికి ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. 69 జీఓతో రాయలసీమ రైతులు నష్టపోతారని, జీఓ రద్దుకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. పట్టిసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎలా సస్యశ్యామలం చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఉద్యోగాలపై పీఎం మోడీతో పాటు సీఎం చంద్రబాబుకు మల్టీజోనల్‌పై లేఖ రాస్తే ఇంత వరకు సమాధానం చెప్పలేదన్నారు. -
అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
–సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదోని : రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో ఇటీవల మృతి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు కుంకునూరు పెద్దయ్య కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నారని, ఆయన ఏ ముఖం పెట్టుకుని జనం వద్దకు వెళ్లుతున్నారో చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు. అధికార దాహంతోనే చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఒడిశా సరిహద్దులో జరిగిన బూటకపు ఎన్‌కౌంటరుపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, విప్లవ నేత ఆర్కే ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వేదిక ఏర్పాటు ప్రశంసనీయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు సమాజిక హక్కుల వేదికను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం ఆయన ఫారెస్ట్లేన్, సీఆర్ నగర్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వేదిక జిల్లా కన్వీనరు జగన్నాథం, సీపీఐ కార్యదర్శి రామాంజనేయులు, ఎంఆర్పీఎస్ జిల్లా నేతసోమసుందరం, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమాంఖాసీం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి పాల్గొన్నారు.