అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
–సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆదోని : రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో ఇటీవల మృతి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు కుంకునూరు పెద్దయ్య కుటుంబాన్ని గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వాన్ని జనం ఛీ కొడుతున్నారని, ఆయన ఏ ముఖం పెట్టుకుని జనం వద్దకు వెళ్లుతున్నారో చెప్పాలని రామకృష్ణ ప్రశ్నించారు. అధికార దాహంతోనే చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఒడిశా సరిహద్దులో జరిగిన బూటకపు ఎన్‌కౌంటరుపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, విప్లవ నేత ఆర్కే ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వేదిక ఏర్పాటు ప్రశంసనీయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు సమాజిక హక్కుల వేదికను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం ఆయన ఫారెస్ట్‌లేన్, సీఆర్ నగర్‌లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వేదిక జిల్లా కన్వీనరు జగన్నాథం, సీపీఐ కార్యదర్శి రామాంజనేయులు, ఎంఆర్‌పీఎస్ జిల్లా నేతసోమసుందరం, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమాంఖాసీం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి పాల్గొన్నారు.