సీమ ప్రజలను మభ్యపెడుతున్న సీఎం
- జీఓ నెం.69ని రద్దు చేయకుండా
మోసం చేస్తున్నారు
- జాతీయ, రైతుల సంఘాల సమాఖ్య
సెక్రటరీ జనరల్ బొజ్జా
నంద్యాలరూరల్: సాగునీటి జలాల విషయంలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. జీఓ నెం.69ని రద్దు చేయకుండా శ్రీశైలం జలాశయంలోని నీటిని రాయలసీమకు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయడం మోసపూరితమేనన్నారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణలో ‘రాయలసీమకు నీటి భిక్ష కాదు -సాగునీటిపై చట్టబద్ధ హక్కు కావాలి’ అంటూ గురువారం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం ప్రసంగం పూర్తిగా సత్యదూరమన్నారు. జీఓ నెం.69ని రద్దు చేయకుండా రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయం నుంచి నీరందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జలాశయం నిండుకుండలా ఉన్నా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, హంద్రీనీవాకు పూర్తిస్థాయిలో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నికర జలాలున్నా ప్రాజెక్టులకు నీరందకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. పట్టిసీమ ద్వారా మిగిలిన 45టీఎంసీలు, చింతలపూడి ద్వారా 32టీఎంసీలు, పులిచింతల ద్వారా అదనంగా వచ్చే 54టీఎంసీలు, శ్రీశైలం డ్యాంకు కేటాయించిన క్యారీ ఓవర్ 60టీఎంసీలు మొత్తం 191టీఎంసీలపై రాయలసీమకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచి సాగునీటిపై చట్టబద్ధత సాధించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టి కరువుకు శాశ్వత కరువుకు పరిష్కారం చూపాలన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, వేదవతిపై ఎత్తిపోతల పథకం, గురురాఘవేంద్ర ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఉద్యమించి సాగునీటిపై చట్టబద్ధమైన హక్కు సాధించుకుందామని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 854అడుగులుండేలా చర్యలు తీసుకోకుంటే సీమ ద్రోహిగా మిగిలిపోతారంటూ సీఎంను హెచ్చరించారు. సదస్సులో రాయలసీమ సాగునీటి సాధన సమితి, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి కన్వీనర్లు ఏర్వ రామచంద్రారెడ్డి, వైఎన్‌రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎరబోలు ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు వెంకటేశ్వరనాయుడు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.