మైనార్టీ ఓట్ల కోసమే బాబు కపటనాటకం
- వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్
అనంతపురం:
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం చంద్రబాబు కపటనాటకం ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్ అన్నారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నంద్యాలలో 75వేల ముస్లిం మైనార్టీల ఓట్లు ఉన్నాయని, ఇన్ని రోజులుగా వీరిని ఏమాత్రం పట్టించుకోని బాబు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ చూపడం వెనుక ఆంతర్యం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నాలుగు గంటల పాటు జరిగితే అందులో మూడు గంటలు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపైనే చర్చించారంటే వారిలో ఎంత భయం ఉందో అర్థమవుతోందన్నారు. దివంగత వైఎస్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్ హామీలు ఇచ్చారన్నారు. పలు సర్వేలు చేయించి గెలిచే వారికే టికెట్లు ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన సర్వేలో కుమారుడు లోకేష్ గెలవలేడని తేలడంతోనే అడ్డదారిలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినట్లున్నారని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఒకే ఒక్క సీటు ఇచ్చారని.. అది కూడా ఓడిపోయే స్థానాన్ని కేటాయించారన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అంచెలంచెలుగా నిర్వీర్యం చేస్తోందని.. మంత్రి నారాయణకు వీటిని ధారాదత్తం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మవొడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కచ్చితంగా బలోపేతం చేస్తామన్నారు.
చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా మైనార్టీలు నంద్యాలలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారాయని.. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి పింఛను ఇవ్వలేని స్థితిలో జన్మభూమి కమిటీలు ఉన్నాయన్నారు.