బ్యాడ్మింటన్‌లో ‘తూర్పు’ ‘రాకెట్‌’ | badminton krishna prasad | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌లో ‘తూర్పు’ ‘రాకెట్‌’

Published Fri, Apr 28 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

బ్యాడ్మింటన్‌లో ‘తూర్పు’ ‘రాకెట్‌’

బ్యాడ్మింటన్‌లో ‘తూర్పు’ ‘రాకెట్‌’

 –పతకాల పంట పండిస్తున్న కృష్ణప్రసాద్‌
-జూనియర్‌ డబుల్స్‌లో ప్రపంచ నం:2 ర్యాంక్‌
భానుగుడి(కాకినాడ) : షటిల్‌ బ్యాడ్మింటన్‌లో తూర్పు కిరణం అనితర సాధ్యంగా మెరుస్తోంది. తండ్రి ఆశలకు, ఆశయాలకు ప్రతి రూపంగా ఎదిగిన ఆ కుర్రాడు  పట్టుమని 17 సంవత్సరాలు రాకుండానే అటు సీనియర్, ఇటు జూనియర్‌ ఫార్మాట్లలో డబుల్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అతడే  కాకినాడకు  చెందిన గరగ కృష్ణప్రసాద్‌. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈనెల 25న జారీ చేసిన ర్యాంకింగ్స్‌లో జూనియర్‌ డబుల్స్‌లో ప్రపంచ రెండోర్యాంకుతో పాటు జాతీయ స్థాయి మొదటి ర్యాంకు ప్రసాద్‌కు దక్కాయి. 
తండ్రి నుంచి వారసత్వంగా ..
ప్రసాద్‌ తండ్రి గంగాధర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌లో ఆంధ్రా యునివర్సిటీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆల్‌ఇండియా స్థాయిలోనూ ఆడారు. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్న కల కలగానే మిగిలిపోయింది. దాన్ని కుమారుని ద్వారా తీర్చుకోవాలని నాలుగేళ్ళ వయసు నుంచే అతడితో సాధన చేయించారు. ప్రస్తుతం ప్రసాద్‌ గోపీచంద్‌ అకాడమీలో అంతర్జాతీయ కోచ్‌లు టామ్‌కిమ్‌హెర్, విజయ్‌ దీప్‌సింగ్, రాజేంద్ర కుమార్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు
ఇదీ ప్రసాద్‌ విజయపరంపర
డచ్‌ జూనియర్‌ ఇంటర్‌ నేషనల్‌ డబుల్స్‌లో కపిల్‌ధృవ్‌తో కలిసి రజతపతకం సా«ధించాడు. గతేడాది జాతీయస్థాయిలో జరిగిన అండర్‌–19 డబుల్స్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విన్నర్‌గా నిలిచాడు. 2015లో ఆసియన్‌ జూనియర్‌ టోర్నమెంట్‌లో అండర్‌–17లో బంగారు పతకాన్ని సాధించాడు. సుశాంత్‌ చిప్‌లకట్టి మెమోరియల్‌ టోర్నీలో 2014 నుంచి 2017 వరకు జాతీయస్థాయి పతకాలు సాధించాడు. 2016లో జరిగిన ఆసియన్‌ బ్యాడ్మింటన్‌లో  దేశానికి కాంస్యపతకం సాధించిన బృందంలో ప్రసాద్‌ సభ్యుడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌  టోర్నీలో సాత్విక్‌సాయితో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. 2016లో, 2017లో సీనియర్‌ నేషనల్స్‌లో కపిల్‌ధృవ్‌తో కలిసి డబుల్స్‌లో కాంస్యం సాధించాడు. ఆసియన్‌ బ్యాడ్మింటన్‌ సీనియర్‌లో ఇండియాకి ఇప్పటి వరకు చైనీస్, మలేషియా, జపాన్, కొరియన్ దేశస్థులే ఎక్కువగా పోటీని ఇచ్చారని, కొరియన్‌ దేశానికి చెందిన లీయంగ్‌ సబ్‌సోమెన్‌లింగ్‌తో సుశాంత్‌ చిప్‌లకట్టి మెమోరియల్‌ టోర్నీలో ఫైనల్‌లో తలపడ్డానని, తాను ఎదుర్కొన్న ప్రత్యర్ధుల్లో అతనే మేటి క్రీడాకారుడని ప్రసాద్‌ పేర్కొన్నాడు.
ఈ ఏడాది వరల్డ్‌  నంబర్‌వన్‌ కావడమే లక్ష్యం..
 జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌, జూనియర్‌ ఆసియన్‌ బ్యాడ్మింటన్, జూనియర్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సాధించడం ఈ సంవత్సరం తన లక్ష్యాలని చెప్పాడు ప్రసాద్‌. షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలన్న ఆశయంతోనే సాధన చేస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం గోపీచంద్‌ అకాడమీలో గోపీచంద్‌ తల్లి సుబ్బరావమ్మ, సీనియర్‌ క్రీడాకారుల పర్యవేక్షణలో మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఉదయం 5గంటలకు నిద్ర లేవడం దగ్గర్నుంచి రాత్రి ప్రాక్టీస్‌ ముగించుకుని నిద్రించే వరకు నెట్స్‌లో 8గంటల పాటు ప్రాక్టీస్‌, ఇంటర్‌నెట్‌ ద్వారా షటిల్‌లో సరికొత్త ప్రయోగాలను సాధన, కోచ్‌ల పర్యవేక్షణలో ప్రపంచ క్రీడలకు సిద్ధమవుతున్నానన్నాడు.
కృష్ణప్రసాద్‌ది రాయవరం మండలం సోమేశ్వరం. అక్కడి నుంచి తండ్రి వ్యాపారరీత్యా కాకినాడకు మకాం మార్చారు. ఒకటో తరగతి నుంచి ఎంఎస్‌ఎన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో చదివి 8వ తరగతి పూర్తికాగానే గోపీచంద్‌ అకాడమీలో చేరాడు. ప్రస్తుతం కాకినాడ ఎంఎస్‌ఎన్‌ ఎయిడెడ్‌  కాలేజీలో ఇంటర్‌ ప్రయివేట్‌గా చదువుతున్నాడు.
నాన్నే తొలిగురువు..
నాన్న గంగాధర్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌లో మంచి క్రీడాకారుడు. ఆంధ్రా యూనివర్సిటీకి కెప్టెన్‌గా సత్తాచాటారు. 2007 నుంచి నాన్న వద్దే శిక్షణ తీసుకున్నా. పదేళ్ళ వయసు నుంచే రాకెట్‌ పట్టాను. జిల్లాస్థాయి టోర్నీ నుంచి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగానంటే నాన్న నేర్పిన మెళకువలే కారణం. తండ్రే గురువుగా వ్యవహరించే అరుదైన అదృష్టం దక్కిన అతికొద్దిమందిలో నేనూ ఒక్కడిగా ఉండడం ఆనందంగా ఉంది.
-కృష్ణప్రసాద్
చాలా ఆనందంగా ఉంది.
చిన్నప్పటి నుంచి  ప్రసాద్‌ షటిల్‌లో అద్భుతమైన ఆటతీరు కనబర్చేవాడు. వాడిలో ఉన్న ప్రతిభను గమనించి మంచి కోచ్‌ల పర్యవేక్షణలో ఉంచాలని గోపీచంద్‌ అకాడమీలో చేర్పించాం. గతేడాది వరకు  డబుల్స్‌లో నంబర్‌ 3గా, ఆల్‌ ఇండియా లెవల్‌లో నంబర్‌ 2గా ఉన్న ప్రసాద్‌ ప్రస్తుతం ప్రపంచ జూనియర్‌ డబుల్స్‌లో నంబర్‌-2గా, ఆల్‌ ఇండియా నంబర్‌-1గా తన స్థానాన్ని మెరుగుపర్చుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది.
-గంగాధర్ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement