ఏలూరు (సెంట్రల్) : అధిక వడ్డీలు ఆశచూపి ప్రజల నుంచి రూ.వేలాది కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించి.. గడువు దాటినా తిరిగి చెల్లించని కేసులో అరెస్టయిన అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరికి ఇద్దరు హామీదారులు రూ. 5 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరి పాస్‌పోర్టులను సీఐడీ అధికారులకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, ప్రతి బుధవారం రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని జిల్లా న్యాయమూర్తి తుకారాంజీ ఆదేశించారు.
ఈ మేరకు ఏలూరులోని జిల్లా న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే... పెదపాడు మండలం వడ్డిగూడేనికి చెందిన ఘంటశాల వెంకన్నబాబు ఫిర్యాదు మేరకు 2015 జనవరి 3న పెదపాడు పోలీసులు అగ్రిగోల్డ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును రాష్ర్ట ప్రభుత్వం సీఐడీ అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏలూరు కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. న్యాయస్థానం అనుమతితో ఏపీ, తెలంగాణ సీఐడీ అధికారులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని పలుమార్లు విచారణ జరిపారు.