పులకించి‘నది’
పులకించి‘నది’
Published Wed, Jun 7 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు
అప్పనపల్లి(మామిడికుదురు) : శ్రీబాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్‌కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్‌తో పాటు గోవిందా... గోవిందా...గోవింద... అంటూ భక్తులు గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్‌కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠి,
ధ్వజారోహణ, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు బోర్డు సభ్యులు కంకిపాటి సుబ్బారావు, సుందరనీడి వీరబాబు, బోనం బాబు, వాసంశెట్టి వెంకట్రావు, పోతుమూడి రాంబాబులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న కల్యాణోత్సవాలు
శ్రీబాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపుష్పయాగం, రుత్విక్ సన్నానంతో ముగుస్తాయని ఆలయ ఈఓ పి.బాబూరావు తెలిపారు.
నేటి కార్యక్రమాలు..
ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ
6 గంటలకు సహస్రనామార్చన, 7 గంటలకు బాల భోగం నివేదన, 7.30కు వేదపారాయణం, నిత్యహోమం, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి
రాత్రి 7 గంటలకు నిత్యారాధన ఉత్సవాలు, నిత్య హోమం, 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం(పవళింపు సేవ), మంగళశాసనం, రుత్విక్ సన్మానం, తీర్ధ ప్రసాద గోష్ఠి
Advertisement
Advertisement