kalyanothsavam
-
శ్రీపుష్పయాగంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు అప్పనపల్లి,(మామిడికుదురు) : శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ కనులపండువలా సాగిన శ్రీబాలబాలాజీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్ప సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలబాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉ«భయ దేవేరులతో కొలువు తీరిన బాలబాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. ముందుగా సుప్రభాత సేవతో ఐదోరోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజచినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. బాలభోగం, నివేదన, వేదపారాయణం హృద్యంగా ఆలపించారు. నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఈఓ పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
పులకించి‘నది’
వైభవంగా శ్రీవారి చక్రస్నానం వసంతోత్సవంలో పాల్గొన్న భక్తులు అప్పనపల్లి(మామిడికుదురు) : శ్రీబాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సుదర్శన పెరుమాళ్‌కు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయించారు. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్‌తో పాటు గోవిందా... గోవిందా...గోవింద... అంటూ భక్తులు గోదావరి నదిలో తలారాస్నానం చేసి పునీతులయ్యారు. చక్రస్నానం వైభవోపేతంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు వసంతాలు చల్లుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో వసంతోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్‌కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. శ్రీవారికి సహస్రనామార్చన, బాల భోగం నివేదన, వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థప్రసాద గోష్ఠి, ధ్వజారోహణ, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు బోర్డు సభ్యులు కంకిపాటి సుబ్బారావు, సుందరనీడి వీరబాబు, బోనం బాబు, వాసంశెట్టి వెంకట్రావు, పోతుమూడి రాంబాబులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, దేవస్థానం ఉద్యోగులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేటితో ముగియనున్న కల్యాణోత్సవాలు శ్రీబాల బాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీపుష్పయాగం, రుత్విక్ సన్నానంతో ముగుస్తాయని ఆలయ ఈఓ పి.బాబూరావు తెలిపారు. నేటి కార్యక్రమాలు.. ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ 6 గంటలకు సహస్రనామార్చన, 7 గంటలకు బాల భోగం నివేదన, 7.30కు వేదపారాయణం, నిత్యహోమం, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి రాత్రి 7 గంటలకు నిత్యారాధన ఉత్సవాలు, నిత్య హోమం, 8 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం(పవళింపు సేవ), మంగళశాసనం, రుత్విక్ సన్మానం, తీర్ధ ప్రసాద గోష్ఠి -
లోక కల్యాణార్థం ఘనంగా వేద సదస్యం
ఘనంగా మూడో రోజు కార్యక్రమాలు అప్పనపల్లి(మామిడికుదురు) : బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో మూడో రోజు మంగళవారం భక్తుల కోలాహలంతో ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాల బోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం) వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు అంతర్వేది, వాడపల్లి, మురముళ్ల, భీమవరం, ఆచంట, ద్వారకా తిరుమల, మందపల్లి, దవళేశ్వరం తదితర ఆలయాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, జగత్ రక్షణ కోసం వేద సదస్యం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెదపట్నం గ్రామానికి చెందిన పుచ్చల తాతారావు, మొగలికుదురుకు చెందిన ఉప్పులూరి సుబ్బారావు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఆలయ ఈఓ పొలమూరి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నేటి కార్యక్రమాలు... ఉదయం ఐదు గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ, ఆరు గంటలకు శ్రీవారికి సహస్రనామార్చన, ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన, 7.30 గంటలకు వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, 10 గంటలకు శ్రీవారికి చక్రస్నానం, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం ఏడు గంటలకు ధ్వజా అవరోహణ, మంగళాశాసనం, తీర్థ ప్రసద గోష్ఠి -
అంగరంగ వైభవంగా బాలబాలాజీ కల్యాణోత్సవం
పులకించిన భక్తజనులు అప్పనపల్లి(మామిడికుదురు) : భక్తుల కోలాహలం, గోవిందనామ స్మరణ, మంగళవాయిద్యాలు, నయనానందకరంగా అలంకరించిన పూల మండపంలో అప్పనపల్లి పుణ్యక్షేత్రంలో బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తం రాత్రి 9.02 గంటలకు ఉభయ దేవేరులను బాలబాలాజీ స్వామి పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ నిర్వహించిన రాయబార ఉత్సవం (ఎదుర్కోలు సన్నాహం) కడు రమణీయంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పలు రకాల పుష్పాలతో సుందరంగా రూపొందించిన మంటపంలో శ్రీదేవి, భూదేవిలతో కొలువు తీరిన బాలాజీ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆలయం తరఫన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి, అంతర్వేది లక్ష్మీనర్శింహస్వామి ఆలయాలకు చెందిన వేద పండితులు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. రావులపాలేనికి చెందిన మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు కుటుంబ సభ్యులు మంచి ముత్యాలు, పగడాలు తలంబ్రాలుగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దాల తిరుమల శింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిçష్యులు చమలచెర్ల మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఆద్యంతం కనుల పండువలా నిర్వహించారు. కల్యాణోత్సవంలో 260 మంది దంపతులు కర్తలుగా పాల్గొన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, అమలాపురం ఆర్డీఓ కె.గణేష్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యులు విత్తనాల మాణిక్యాలరావు, గంగుమళ్ల కాశీఅన్నపూర్ణ తదితరులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. -
నవవరునిగా బాలబాలాజీ
-వార్షిక దివ్యతిరుకల్యాణోత్సవాలకు శ్రీకారం -నేటి రాత్రి 9.02 గంటలకు పరిణయ వేడుక మామిడికుదురు (పి.గన్నవరం) : భక్తజనమనోరంజకంగా వైనతేయ తీరాన కొలువైన బాలబాలాజీ నవవరుడయ్యాడు. వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూరాగరు సుగంధ వీచికల నడుమ స్వామి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల శుభ ముహూర్తాన పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాలబాలాజీతో పాటు ఉభయ దేవేరుల బుగ్గన చుక్క పెట్టి వారిని పెళ్లికొడుకు, పెళ్లికుమార్తెలుగా తీర్చిదిద్దారు. కల్యాణోత్సవాలు నిరాటంకంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన నిర్వహించారు. తదుపరి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, అంకురార్పణ, హోమం, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు కల్యాణోత్సవాలు కనుల పండుగలా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. నేటి కార్యక్రమాలు -ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ -ఆరు గంటలకు స్వామి వారికి సహస్రనామార్చన -ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన -ఎనిమిది గంటలకు చతుస్ధానార్చనలు - 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద గోష్ఠి -సాయంత్రం 4 గంటలకు బాల బాలాజీ స్వామి వారి తిరువీధి ఉత్సవం -ఆరు గంటలకు చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ -రాత్రి 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) -9.02 గంటలకు దివ్య తిరు కల్యాణోత్సవం, తీర్థ ప్రసాద గోష్ఠి -
బాలాజీ ఆలయానికి కల్యాణశోభ
నేటి నుంచే తిరు కల్యాణోత్సవాలు సోమవారం రాత్రి 9.02 గంటలకు కల్యాణం అప్పనపల్లి (మామిడికుదురు) : నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతూ, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే పరంధాముడిగా పూజలందుకుంటున్న బాల బాలాజీ స్వామి దివ్య క్షేత్రం వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల కాంతులు, కర్పూర పరిమళాలతో శ్రీవారి ఆలయం కల్యాణ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామి వారి తిరు కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 9.02 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు తెలిపారు. గ్రామ చరిత్ర: మూడున్నర దశాబ్ధాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం. నూతన ఆలయ నిర్మాణం: 1970 మార్చి 18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1991 జూలై నాలుగో తేదీన టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్, సబ్సిడీపై కొనుగోలు చేసిన పద్మావతిదేవి, ఆండాళ్‌తాయార్, గరుడాళ్వార్ల విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ఆలయానికి చేరుకునేది ఇలా... స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి తాటిపాక చేరుకోవాలి. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలో మీటర్లు. ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. -
కనుల పండువగా కల్యాణోత్సవం
ఉరవకొండ రూరల్ : మండల పరిధిలోని శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవ వేడుకల్లో భాగంగా అత్యంత కీలకమైన శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి పలు పూజా కార్యక్రమాల అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వేద పండితుల మధ్య స్వామివారి కల్యాణోత్సవ వేడుకలు వేలాదిమంది భక్తాదుల నడుమ సందడిగా సాగింది. ఉత్సవ ఉభయదాతలు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
-స్వామి, అమ్మవార్లకు 9 పిండివంటల నివేదన -విష్ణుమూర్తి, లక్ష్మీ అవతారాల్లో ఊయలసేవ -ముగిసిన దివ్యకల్యాణ మహోత్సవాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల చివరి రోజు వైశాఖ బహుళ పాడ్యమి గురువారం రాత్రి సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అనివేటి మండపానికి సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లిపెద్దలు సీతారాములను ఊరేగింపుగా రాత్రి 7.30 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ గల వెండి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనం మీద పెళ్లిపెద్దలు సీతారాములను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరపూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వíßహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్, ఈఓ నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద పవళించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అవతారంలో సత్యదేవుడు, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. మొత్తం పది రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను సేవించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోఛ్చాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి పులకించారు. తరువాత ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులకు, వేదపండితుల దంపతులకు, ఈఓ దంపతులకు దంపత తాంబూలాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రవికెలగుడ్డలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర అర్చకస్వాములు, పురోహితులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా సత్యదేవుని శ్రీచక్రస్నానం
- పంపా నదిలో నీరు లేక ఇబ్బంది - బిందెతో నీరు తీసి కార్యక్రమం పూర్తిచేసిన పండితులు అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు వైశాఖ బహుళ పాడ్యమి, బుధవారం ఉదయం సత్యదేవునికి పంపా నదిలో శ్రీ చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములు ఊరేగింపుగా పంపా నదీ తీరంలో పవర్ హౌస్ వద్ద ఉన్న వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆ పక్కనే ఉన్న ఆసనంపై సీతా రాములను ప్రతిష్టించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తరువాత ఊరేగింపుగా పంపా నది లోనికి తీసుకువెళ్లి నదీ జలాలతో పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామి వారికి, శ్రీ చక్రానికి స్నానం నిర్వహించారు. కార్యక్రమానికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు, ఏసీ జగన్నా«ధరావు హాజరయ్యారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహతులు నాగాబట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, అర్చక స్వాములు కోట శ్రీను, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. అడుగులోతు నీటిలోనే శ్రీచక్ర స్నానం... నదిలో నీరు అడుగు లోతు మాత్రమే ఉండడంతో బిందెలతో నీరు తోడి పోశారు. భక్తులు కూడా అరకొరగా నీళ్లు మీద పోసుకుని స్నానం అయిందనిపించారు. పంపా నదిలో చాలా రోజుల క్రితమే నీరు అడుగంటింది. రెండ్రోజుల కిందటే రెండు అడుగులు నీరు ఉండేలా ఇంజినీరింగ్ సిబ్బంది గొయ్యి తవ్వగా నీరు చేరినా విరగకాసిన ఎండలకు ఆ నీరు కాస్తా ఆవిరై పోయింది. చిన్న పుష్కరణి వంటిది ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం... ఎప్పుడూ నడి వేసవిలోనే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. భవిష్యత్‌లో కూడా ఇటువంటి నీటి సమస్య పునరావృతమయ్యే అవకాశాలున్నందున దేవస్థానం కనీసం మూడు సెంట్ల స్థలంలో ‘గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్’ (జీఎల్ఆర్)లాంటి ‘చిన్న పుష్కరణి ’ నిర్మించుకుని మోటార్లతో అందులో నీటిని నింపి శ్రీ చక్ర స్నానం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం - రత్నగిరిపై భక్తుల రద్దీ...గత మూడు రోజుల్లో 60 వేల మంది రాక అన్నవరం: వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం రత్నగిరి వనదేవత శ్రీ వనదుర్గ అమ్మవారికి ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం తొమ్మిది గంటలకు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. పండితులు ఛామర్తి కన్నబాబు, అంగరసతీష్, సీహెచ్ ప్రసాద్, అర్చకస్వాములు చిట్టెం శ్రీహరగోపాల్, గంగాధరబట్ల శ్రీనివాస్ హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ... రత్నగిరిపై భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వివాహాల సీజన్ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతోంది. సోమ, మంగళ. బుధ వారాలు మూడు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు ఆరువేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. -
స్వామి, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూపించి పూజలు చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వామి కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
చైర్మన్, ఈవోలపై ఎంపీ తోట ఆగ్రహం పోలీసుల బంధువులతో నిండిపోయిన వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు అన్నవరం : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్న తీరుపై అటు వీఐపీలలో, ఇటు సామాన్య భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా శనివారం రాత్రి నిర్వహించిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో దేవస్థానం అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అంటూ వివాహ వేదిక ముందు సగం స్థలాన్ని తమ అదుపులో పెట్టుకుని సామాన్య భక్తులెవరినీ దరిదాపులకు రాకుండా చేశారు. కల్యాణం ప్రారంభమయ్యాక పోలీసులు వారి బంధువులతో ఆ గ్యాలరీలు నింపేశారు. అధికారులపై ఎంపీ ఆగ్రహం గతేడాది స్వామివారి కల్యాణవేదికకు ముందు కాకినాడ ఎంపీ తోటనరసింహానికి సీటు కేటాయించిన అధికారులు ఈసారి వేదికకు దూరంగా కుడివైపున సీటు కేటాయించారు. దీంతో అక్కడ నుంచి చూస్తే సత్యదేవుని కల్యాణ దృశ్యాలు కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దేవస్థానం చైర్మన్, ఈఓ ఇద్దరినీ కాకినాడ పిలిపించి ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రొటోకాల్ లేని వారితో కూడా పట్టువస్త్రాలు, తలంబ్రాల పళ్లాలు నెత్తిన పెట్టడం, వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. భక్తుల రాకుండా అడ్డుకున్న దేవస్థానం సత్యదేవుని కల్యాణానికి తరలి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా ఊదరకొట్టిన దేవస్థానం అధికారులు కల్యాణ సమయానికి మాత్రం భక్తులను కొండమీదకు వచ్చే వీలు లేకుండా చేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఆటోలు రత్నగిరికి నడవకుండా అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కల్యాణం రోజున కూడా ఆటోలను వదల్లేదు. ఎక్కువగా దేవస్థానం బస్‌లను కూడా నడపలేదు. చాలా మంది రాత్రి పది గంటల వరకూ టోల్గేట్ వద్ద ఎదురు చూసి ఇంటికి పోయి టీవీలలో కల్యాణం తిలకించారు. భక్తులను దేవస్థానానికి తరలించాల్సిన ట్రాన్స్‌పోర్టు ఇన్చార్జి రాజు, ఇతర సిబ్బంది చైర్మన్, ఈఓల సేవలలో తరించారు. జేబు దొంగల చేతివాటం కల్యాణ వేదిక వద్ద సుమారు వంద మందికి పైగా పోలీసులు బంబోబస్తు, వీరికి తోడు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జేబుదొంగలను మాత్రం నిరోధించలేక పోయారు. కాకినాడకు చెందని తుమ్మలపల్లి శివప్రసాద్ జేబులో ఉన్న రూ.లక్షను దొంగలు అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున పాయకరావుపేటలో జరిగే గృహ ప్రవేశానికి హాజరవడానికి భార్యతో కలిసి వెడుతూ ఆయన సత్యదేవుని కల్యాణం తిలకించేందుకు రత్నగిరి చేరుకున్నట్టు తెలిపారు. అప్పటి వరకూ భక్తుల గ్యాలరీలో ఉన్న తాను తలంబ్రాలల కోసం వీఐపీ గ్యాలరీ లోకి రాగానే జేబులో ఉన్న 2,000 నోట్ల కట్ట (రూ.లక్ష)ను అపహరించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
అలనాటి ఆలయానికి సొబగులు
- రేపు లక్ష్మీనారసింహుడి కల్యాణోత్సవం - హాజరు కానున్న సినీ ప్రముఖులు అమడగూరు : అమడగూరు మండలానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక ప్రాంతం బిళ్లూరులో నూతనంగా నిర్మితమైన స్తంభ నరసింహాలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. బిళ్లూరు ఎస్సీ కాలనీ సమీపంలో గుట్టమీద సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈశ్వరుడు, ఆంజనేయస్వామి భారీ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, కుర్చోవడానికి ఆసనాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల శిల్పాలు, శిలా విగ్రహాలు, పైన గుడి గోపురాలు, ఆలయ ప్రధాన ద్వారం చూడచక్కగా ఉన్నాయి. ఈ ఆలయంలో 9వ తేదీ మంగళవారం లక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు గారు ఏకాంతసేవ, తనికెళ్ల భరణి ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కార్యక్రమానికి గౌరవాధ్యక్షుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరు కానున్నారు. చోళరాజుల కాలం నాటి ఆలయం సుమారు 1300 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలోనే ఈ గుడి ఉండేదని, 500 సంవత్సరాల క్రితం ఆలయాన్ని శ్రీకష్ణ దేవరాయలు దానిని పునర్నిర్మించారని ఆలయ ధర్మకర్త దంపతులు కోడూరు రామ్మూర్తి, రాధ తెలిపారు. ఇప్పుడు వంశపారంపర్యంగా తమ చేతుల్లో మరోసారి రూపుదిద్దుకుంటోందన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. తాము 25 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నప్పటికీ తమవాళ్లంతా బిళ్లూరులోనే ఉన్నారన్నారు. సొంత గ్రామానికి ఏదోకటి చేయాలనే తపనే ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా నడిపించిందన్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో విశేషపూజలు, శ్రావణమాసంలో వార్షికోత్సవ పూజలు వరుసగా పది రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. 9 వ తేదీన కల్యాణోత్సవంలో భాగంగా సుప్రభాతసేవ, అభిషేకం, విశేష అలంకరణ, వేద పారాయణం లాంటివి చేయిస్తున్నామని, ప్రముఖులు కూడా హాజరవుతున్నారని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
రత్నగిరిపై కల్యాణ కాంతులు
- నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు - సాయంత్రం 4 గంటలకు వధూవరులు కానున్న అమ్మవారు, స్వామి - రేపు రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ మహోత్సవం అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం కల్యాణ తిలకం దిద్దుకుంటున్నవేళ.. పావన దివ్యక్షేత్రం రత్నగిరి సానువులు పులకరిస్తున్నాయి. వరాలిచ్చే సత్యదేవుడే వరుడవుతున్న వేళ.. సిరులిచ్చే శ్రీమహాలక్ష్మే వధువవుతున్న శుభవేళ.. రత్నగిరి కల్యాణశోభతో తుళ్లిపడుతోంది. ఈ కమనీయ ఘట్టానికి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అనివేటి మండపంలో అంగరంగ వైభవంగా.. సత్యదేవుని ప్రధానాలయం దిగువన అనివేటి మండపంలో అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం గంటన్నరపాటు జరుగుతుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు రత్నగిరి కళావేదిక మీద ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. పండితులు రెండు పక్షాలుగా ఏర్పడి.. స్వామి, అమ్మవార్ల ఘనకీర్తిని, వంశచరితను వివరించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. సీతారాములే పెళ్లిపెద్దలుగా.. సత్యదేవుని కల్యాణానికి రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం నుంచే వారి పెద్దరికం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే కల్యాణం, ఆపై ఐదు రోజులపాటు వరుసగా జరిగే వైదిక కార్యక్రమాలు.. పండిత సత్కారం, వనవిహారం, చక్రస్నానం, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. వారం రోజులపాటు నిత్యకల్యాణాల నిలుపుదల ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజులూ స్వామివారి నిత్యకల్యాణాలు జరగవు. తిరిగి 12వ తేదీ నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమవుతాయి. -
కొండకు కల్యాణశోభ
-సత్యదేవుని పెండ్లివేడుకకు ముస్తాబైన రత్నగిరి -శనివారం రాత్రి 9.30 గంటల నుంచి పరిణయోత్సవం అన్నవరం : సత్యదేవుని కల్యాణ వేడుకలకు రత్నగిరి ముస్తాబయింది. శుక్రవారం నుంచి ఈనెల 11 వరకూ జరగనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర«ధానాలయం, ఉపాలయాలు, కల్యాణ వేదిక, ఇతర కట్టడాలను, కొండ దిగువన వివిధ సత్రాలనూ రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎండ తగలకుండా ప్రధానాలయం చుట్టూ షామియానాలు వేయించారు. అన్నవరంలో పలు చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు, ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో సత్యదేవుని ప్రచారరథం ద్వారా కల్యాణ మహోత్సవాల గురించి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేయడంతో కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని దూరదర్శన్, టీటీడీ చానల్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఊరేగింపునకు వాహనాలు సిద్ధం శుక్రవారం నుంచి మంగళవారం వరకూ కొండ దిగువన పెళ్లిపెద్దలు శ్రీసీతారాములతో పాటు సత్యదేవుడు, అమ్మవార్లను వివిధవాహనాలలో ఊరేగించనున్నారు. ఆ వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధ చేశారు. రావణబ్రహ్మ, పొన్నచెట్టు వాహనాలకు రంగులు వేసి ఊరేగింపునకు సిద్దం చేశారు. ఊరేగింపు జరిగే ఐదు రోజులు అన్నవరం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొననున్నారు. కల్యాణం రోజున నలుగురు ఎస్ఐలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణోత్సవాల ఏడు రోజులు స్థానిక కళాకారులతో భక్తిరంజని, హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పౌరాణిక నాటకాలను ఈ ఏడాది కూడా రద్దు చేశారు.