శ్రీపుష్పయాగంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీపుష్పయాగంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Published Thu, Jun 8 2017 11:07 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు
అప్పనపల్లి,(మామిడికుదురు) : శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ కనులపండువలా సాగిన శ్రీబాలబాలాజీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్ప సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలబాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉ«భయ దేవేరులతో కొలువు తీరిన బాలబాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. ముందుగా సుప్రభాత సేవతో ఐదోరోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజచినజీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. బాలభోగం, నివేదన, వేదపారాయణం హృద్యంగా ఆలపించారు. నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఈఓ పొలమూరి బాబూరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
Advertisement
Advertisement