సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
Published Sun, May 7 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM
చైర్మన్, ఈవోలపై ఎంపీ తోట ఆగ్రహం
పోలీసుల బంధువులతో నిండిపోయిన వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు
అన్నవరం : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్న తీరుపై అటు వీఐపీలలో, ఇటు సామాన్య భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా శనివారం రాత్రి నిర్వహించిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో దేవస్థానం అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అంటూ వివాహ వేదిక ముందు సగం స్థలాన్ని తమ అదుపులో పెట్టుకుని సామాన్య భక్తులెవరినీ దరిదాపులకు రాకుండా చేశారు. కల్యాణం ప్రారంభమయ్యాక పోలీసులు వారి బంధువులతో ఆ గ్యాలరీలు నింపేశారు.
అధికారులపై ఎంపీ ఆగ్రహం
గతేడాది స్వామివారి కల్యాణవేదికకు ముందు కాకినాడ ఎంపీ తోటనరసింహానికి సీటు కేటాయించిన అధికారులు ఈసారి వేదికకు దూరంగా కుడివైపున సీటు కేటాయించారు. దీంతో అక్కడ నుంచి చూస్తే సత్యదేవుని కల్యాణ దృశ్యాలు కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దేవస్థానం చైర్మన్, ఈఓ ఇద్దరినీ కాకినాడ పిలిపించి ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రొటోకాల్ లేని వారితో కూడా పట్టువస్త్రాలు, తలంబ్రాల పళ్లాలు నెత్తిన పెట్టడం, వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది.
భక్తుల రాకుండా అడ్డుకున్న దేవస్థానం
సత్యదేవుని కల్యాణానికి తరలి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా ఊదరకొట్టిన దేవస్థానం అధికారులు కల్యాణ సమయానికి మాత్రం భక్తులను కొండమీదకు వచ్చే వీలు లేకుండా చేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఆటోలు రత్నగిరికి నడవకుండా అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కల్యాణం రోజున కూడా ఆటోలను వదల్లేదు. ఎక్కువగా దేవస్థానం బస్‌లను కూడా నడపలేదు. చాలా మంది రాత్రి పది గంటల వరకూ టోల్‌గేట్ వద్ద ఎదురు చూసి ఇంటికి పోయి టీవీలలో కల్యాణం తిలకించారు. భక్తులను దేవస్థానానికి తరలించాల్సిన ట్రాన్స్‌పోర్టు ఇన్‌చార్జి రాజు, ఇతర సిబ్బంది చైర్మన్, ఈఓల సేవలలో తరించారు.
జేబు దొంగల చేతివాటం
కల్యాణ వేదిక వద్ద సుమారు వంద మందికి పైగా పోలీసులు బంబోబస్తు, వీరికి తోడు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జేబుదొంగలను మాత్రం నిరోధించలేక పోయారు. కాకినాడకు చెందని తుమ్మలపల్లి శివప్రసాద్ జేబులో ఉన్న రూ.లక్షను దొంగలు అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున పాయకరావుపేటలో జరిగే గృహ ప్రవేశానికి హాజరవడానికి భార్యతో కలిసి వెడుతూ ఆయన సత్యదేవుని కల్యాణం తిలకించేందుకు రత్నగిరి చేరుకున్నట్టు తెలిపారు. అప్పటి వరకూ భక్తుల గ్యాలరీలో ఉన్న తాను తలంబ్రాలల కోసం వీఐపీ గ్యాలరీ లోకి రాగానే జేబులో ఉన్న 2,000 నోట్ల కట్ట (రూ.లక్ష)ను అపహరించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
Advertisement