satyanarayanaswami
-
ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
-పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం -భక్తులకు పవిత్రాల పంపిణీ అన్నవరం (ప్రత్తిపాడు): రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న సత్యదేవుని 127వ ఆవిర్భావదినోత్సవాలు (జయంత్యుత్సవాలు) బుధవారం ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. -
ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి ఆరుగురు వేదపండితులకు ఘన సత్కారం వైభవంగా స్వామివారి వెండి రథోత్సవం అన్నవరం(ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంత్యుత్సవాన్ని) శ్రావణశుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం పూర్ణాహుతి, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి అభిషేకం స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి దర్బారు మండపంలో నిర్వహిస్తున్న ఆయుష్యహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు, ఆలయ ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుగురు పండితులకు సత్కారం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేదాలలో నిష్ణాతులైన ఆరుగురు పండితులను దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు సత్కరించారు. రాజమండ్రికి చెందిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదపండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని లకు రూ.2500 చొప్పున పారితోషికం, పంచె కండువా, స్వామివారి ప్రసాదాలను బహూకరించి సత్కరించారు. వెండి రథంపై స్వామివారి ఊరేగింపు స్వామివారి ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఈ ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందకు పోటీపడ్డారు. నేడు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం మఖ నక్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారని పండితులు తెలిపారు. అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -
సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం
-ఆయుష్య హోమానికి శ్రీకారం -నేడు, రేపు మూలవిరాట్‌కు అభిషేకాలు అన్నవరం (ప్రత్తిపాడు): శ్రీసత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలు( జయంత్యోత్సవాలు) శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలను నిర్వహించే పండితులు, అర్చకస్వాములు, వంద మంది రుత్విక్కులకు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు వరుణలు, దీక్షావస్త్రాలను బహూకరించారు. మధ్యాహ్నం మండపారాధన, కలశస్థాపన, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణ అర్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దిన వేడుకల్లో భాగంగా సత్యదేవుని ఆయుష్యహోమానికి పండితులు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మంత్రోచ్చరణల మధ్య కొయ్యల రాపిడితో హోమాగ్నిని వెలిగించి గుండంలో వేసి హోమాన్ని ప్రారంభించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం జరుగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశాక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మఖ న క్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. -
ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
-స్వామి, అమ్మవార్లకు 9 పిండివంటల నివేదన -విష్ణుమూర్తి, లక్ష్మీ అవతారాల్లో ఊయలసేవ -ముగిసిన దివ్యకల్యాణ మహోత్సవాలు అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల చివరి రోజు వైశాఖ బహుళ పాడ్యమి గురువారం రాత్రి సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అనివేటి మండపానికి సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లిపెద్దలు సీతారాములను ఊరేగింపుగా రాత్రి 7.30 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ గల వెండి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనం మీద పెళ్లిపెద్దలు సీతారాములను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరపూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వíßహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్, ఈఓ నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద పవళించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అవతారంలో సత్యదేవుడు, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. మొత్తం పది రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను సేవించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోఛ్చాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి పులకించారు. తరువాత ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులకు, వేదపండితుల దంపతులకు, ఈఓ దంపతులకు దంపత తాంబూలాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రవికెలగుడ్డలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర అర్చకస్వాములు, పురోహితులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా సత్యదేవుని శ్రీచక్రస్నానం
- పంపా నదిలో నీరు లేక ఇబ్బంది - బిందెతో నీరు తీసి కార్యక్రమం పూర్తిచేసిన పండితులు అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు వైశాఖ బహుళ పాడ్యమి, బుధవారం ఉదయం సత్యదేవునికి పంపా నదిలో శ్రీ చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములు ఊరేగింపుగా పంపా నదీ తీరంలో పవర్ హౌస్ వద్ద ఉన్న వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆ పక్కనే ఉన్న ఆసనంపై సీతా రాములను ప్రతిష్టించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తరువాత ఊరేగింపుగా పంపా నది లోనికి తీసుకువెళ్లి నదీ జలాలతో పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామి వారికి, శ్రీ చక్రానికి స్నానం నిర్వహించారు. కార్యక్రమానికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు, ఏసీ జగన్నా«ధరావు హాజరయ్యారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహతులు నాగాబట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, అర్చక స్వాములు కోట శ్రీను, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. అడుగులోతు నీటిలోనే శ్రీచక్ర స్నానం... నదిలో నీరు అడుగు లోతు మాత్రమే ఉండడంతో బిందెలతో నీరు తోడి పోశారు. భక్తులు కూడా అరకొరగా నీళ్లు మీద పోసుకుని స్నానం అయిందనిపించారు. పంపా నదిలో చాలా రోజుల క్రితమే నీరు అడుగంటింది. రెండ్రోజుల కిందటే రెండు అడుగులు నీరు ఉండేలా ఇంజినీరింగ్ సిబ్బంది గొయ్యి తవ్వగా నీరు చేరినా విరగకాసిన ఎండలకు ఆ నీరు కాస్తా ఆవిరై పోయింది. చిన్న పుష్కరణి వంటిది ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం... ఎప్పుడూ నడి వేసవిలోనే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. భవిష్యత్‌లో కూడా ఇటువంటి నీటి సమస్య పునరావృతమయ్యే అవకాశాలున్నందున దేవస్థానం కనీసం మూడు సెంట్ల స్థలంలో ‘గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్’ (జీఎల్ఆర్)లాంటి ‘చిన్న పుష్కరణి ’ నిర్మించుకుని మోటార్లతో అందులో నీటిని నింపి శ్రీ చక్ర స్నానం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం - రత్నగిరిపై భక్తుల రద్దీ...గత మూడు రోజుల్లో 60 వేల మంది రాక అన్నవరం: వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం రత్నగిరి వనదేవత శ్రీ వనదుర్గ అమ్మవారికి ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం తొమ్మిది గంటలకు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. పండితులు ఛామర్తి కన్నబాబు, అంగరసతీష్, సీహెచ్ ప్రసాద్, అర్చకస్వాములు చిట్టెం శ్రీహరగోపాల్, గంగాధరబట్ల శ్రీనివాస్ హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ... రత్నగిరిపై భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వివాహాల సీజన్ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతోంది. సోమ, మంగళ. బుధ వారాలు మూడు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు ఆరువేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. -
స్వామి, అమ్మవార్లకు అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నవదంపతులు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అరుంధతి నక్షత్రం చూపించి పూజలు చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకస్వామి కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని కల్యాణ ఏర్పాట్లపై అసంతృప్తి
చైర్మన్, ఈవోలపై ఎంపీ తోట ఆగ్రహం పోలీసుల బంధువులతో నిండిపోయిన వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు అన్నవరం : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్న తీరుపై అటు వీఐపీలలో, ఇటు సామాన్య భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా శనివారం రాత్రి నిర్వహించిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో దేవస్థానం అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీవీఐపీ గ్యాలరీ, వీఐపీ గ్యాలరీ అంటూ వివాహ వేదిక ముందు సగం స్థలాన్ని తమ అదుపులో పెట్టుకుని సామాన్య భక్తులెవరినీ దరిదాపులకు రాకుండా చేశారు. కల్యాణం ప్రారంభమయ్యాక పోలీసులు వారి బంధువులతో ఆ గ్యాలరీలు నింపేశారు. అధికారులపై ఎంపీ ఆగ్రహం గతేడాది స్వామివారి కల్యాణవేదికకు ముందు కాకినాడ ఎంపీ తోటనరసింహానికి సీటు కేటాయించిన అధికారులు ఈసారి వేదికకు దూరంగా కుడివైపున సీటు కేటాయించారు. దీంతో అక్కడ నుంచి చూస్తే సత్యదేవుని కల్యాణ దృశ్యాలు కనిపించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన దేవస్థానం చైర్మన్, ఈఓ ఇద్దరినీ కాకినాడ పిలిపించి ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రొటోకాల్ లేని వారితో కూడా పట్టువస్త్రాలు, తలంబ్రాల పళ్లాలు నెత్తిన పెట్టడం, వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా విమర్శలకు తావిచ్చింది. భక్తుల రాకుండా అడ్డుకున్న దేవస్థానం సత్యదేవుని కల్యాణానికి తరలి రావాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్రకటనల ద్వారా ఊదరకొట్టిన దేవస్థానం అధికారులు కల్యాణ సమయానికి మాత్రం భక్తులను కొండమీదకు వచ్చే వీలు లేకుండా చేశారు. రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఆటోలు రత్నగిరికి నడవకుండా అధికారులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. కల్యాణం రోజున కూడా ఆటోలను వదల్లేదు. ఎక్కువగా దేవస్థానం బస్‌లను కూడా నడపలేదు. చాలా మంది రాత్రి పది గంటల వరకూ టోల్గేట్ వద్ద ఎదురు చూసి ఇంటికి పోయి టీవీలలో కల్యాణం తిలకించారు. భక్తులను దేవస్థానానికి తరలించాల్సిన ట్రాన్స్‌పోర్టు ఇన్చార్జి రాజు, ఇతర సిబ్బంది చైర్మన్, ఈఓల సేవలలో తరించారు. జేబు దొంగల చేతివాటం కల్యాణ వేదిక వద్ద సుమారు వంద మందికి పైగా పోలీసులు బంబోబస్తు, వీరికి తోడు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ జేబుదొంగలను మాత్రం నిరోధించలేక పోయారు. కాకినాడకు చెందని తుమ్మలపల్లి శివప్రసాద్ జేబులో ఉన్న రూ.లక్షను దొంగలు అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున పాయకరావుపేటలో జరిగే గృహ ప్రవేశానికి హాజరవడానికి భార్యతో కలిసి వెడుతూ ఆయన సత్యదేవుని కల్యాణం తిలకించేందుకు రత్నగిరి చేరుకున్నట్టు తెలిపారు. అప్పటి వరకూ భక్తుల గ్యాలరీలో ఉన్న తాను తలంబ్రాలల కోసం వీఐపీ గ్యాలరీ లోకి రాగానే జేబులో ఉన్న 2,000 నోట్ల కట్ట (రూ.లక్ష)ను అపహరించారని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. -
రత్నగిరిపై కల్యాణ కాంతులు
- నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు - సాయంత్రం 4 గంటలకు వధూవరులు కానున్న అమ్మవారు, స్వామి - రేపు రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ మహోత్సవం అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం కల్యాణ తిలకం దిద్దుకుంటున్నవేళ.. పావన దివ్యక్షేత్రం రత్నగిరి సానువులు పులకరిస్తున్నాయి. వరాలిచ్చే సత్యదేవుడే వరుడవుతున్న వేళ.. సిరులిచ్చే శ్రీమహాలక్ష్మే వధువవుతున్న శుభవేళ.. రత్నగిరి కల్యాణశోభతో తుళ్లిపడుతోంది. ఈ కమనీయ ఘట్టానికి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అనివేటి మండపంలో అంగరంగ వైభవంగా.. సత్యదేవుని ప్రధానాలయం దిగువన అనివేటి మండపంలో అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం గంటన్నరపాటు జరుగుతుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు రత్నగిరి కళావేదిక మీద ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. పండితులు రెండు పక్షాలుగా ఏర్పడి.. స్వామి, అమ్మవార్ల ఘనకీర్తిని, వంశచరితను వివరించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. సీతారాములే పెళ్లిపెద్దలుగా.. సత్యదేవుని కల్యాణానికి రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం నుంచే వారి పెద్దరికం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే కల్యాణం, ఆపై ఐదు రోజులపాటు వరుసగా జరిగే వైదిక కార్యక్రమాలు.. పండిత సత్కారం, వనవిహారం, చక్రస్నానం, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. వారం రోజులపాటు నిత్యకల్యాణాల నిలుపుదల ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజులూ స్వామివారి నిత్యకల్యాణాలు జరగవు. తిరిగి 12వ తేదీ నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమవుతాయి. -
కొండకు కల్యాణశోభ
-సత్యదేవుని పెండ్లివేడుకకు ముస్తాబైన రత్నగిరి -శనివారం రాత్రి 9.30 గంటల నుంచి పరిణయోత్సవం అన్నవరం : సత్యదేవుని కల్యాణ వేడుకలకు రత్నగిరి ముస్తాబయింది. శుక్రవారం నుంచి ఈనెల 11 వరకూ జరగనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర«ధానాలయం, ఉపాలయాలు, కల్యాణ వేదిక, ఇతర కట్టడాలను, కొండ దిగువన వివిధ సత్రాలనూ రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎండ తగలకుండా ప్రధానాలయం చుట్టూ షామియానాలు వేయించారు. అన్నవరంలో పలు చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు, ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో సత్యదేవుని ప్రచారరథం ద్వారా కల్యాణ మహోత్సవాల గురించి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేయడంతో కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని దూరదర్శన్, టీటీడీ చానల్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఊరేగింపునకు వాహనాలు సిద్ధం శుక్రవారం నుంచి మంగళవారం వరకూ కొండ దిగువన పెళ్లిపెద్దలు శ్రీసీతారాములతో పాటు సత్యదేవుడు, అమ్మవార్లను వివిధవాహనాలలో ఊరేగించనున్నారు. ఆ వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధ చేశారు. రావణబ్రహ్మ, పొన్నచెట్టు వాహనాలకు రంగులు వేసి ఊరేగింపునకు సిద్దం చేశారు. ఊరేగింపు జరిగే ఐదు రోజులు అన్నవరం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొననున్నారు. కల్యాణం రోజున నలుగురు ఎస్ఐలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కల్యాణోత్సవాల ఏడు రోజులు స్థానిక కళాకారులతో భక్తిరంజని, హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పౌరాణిక నాటకాలను ఈ ఏడాది కూడా రద్దు చేశారు. -
మాఘం.. అమోఘం..
సత్యదేవునికి ‘కోట్లు’ కురిపించిన మాసం హుండీల ద్వారానే రూ.1.11 కోట్ల ఆదాయం రాక మిగిలిన విభాగాల ద్వారా మరో రూ.9 కోట్లు వచ్చే వీలు హుండీ ఆదాయంలో మరలా పది నోట్లదే అగ్రతాంబూలం అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి ఫిబ్రవరి నెలలో వచ్చిన మాఘమాసం దండిగా సిరులు కురిపించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ మాఘమాసంలో భక్తులు సత్యదేవుని సన్నిధికి పోటెత్తారు. ఫలితంగా రికార్డుస్థాయిలో సత్యదేవునికి హుండీల ద్వారా రూ.1,11,13,424 ఆదాయం వచ్చింది. సాధారణంగా హుండీ ఆదాయాన్ని అనుసరించి మిగిలిన విభాగాల ద్వారా ఆదాయం ఎలా వచ్చిందో అంచనా వేస్తారు. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజులకుగాను భారీగా ఆదాయం రావడంతో మిగిలిన ఆదాయ వనరుల ద్వారా దేవస్థానానికి మరో రూ.తొమ్మిది కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే మాఘమాసం సాధారణంగా సత్యదేవుని ఆలయానికి కార్తీకం, వైశాఖ మాసాల తరువాత మాఘాన్ని బాగా ఆదాయాన్ని తెచ్చే మాసంగా చెబుతారు. మాఘమాసంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, నవదంపతులు, వారి బంధుమిత్రులు స్వామి సన్నిధికి తరలివచ్చి స్వామివారి వ్రతాలు ఆచరించి, దర్శించుకుంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి, అదే విధంగా మాఘ ఆదివారాలు, దశమి, బహుళ ఏకాదశి వంటి పర్వదినాలలో భక్తులు అధికంగా రావడం వల్లే ఆదాయం భారీగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. హుండీ ఆదాయంలో పది నోట్లే అధికం సోమవారం లెక్కించిన హుండీ ఆదాయంలో 40 శాతానికి పైగా రూ.పది నోట్లే లభించాయి. మొత్తం హుండీ ఆదాయం రూ. 1,11,13,424 కాగా, అందులో కరెన్సీ 1,04,68,994. చిల్లర నాణేలు రూ.6,44,430. కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు విలువైన రూ.పది నోట్లే ఉండడం విశేషం. రూ.వంద నోట్లు రూ.45 లక్షలు విలువైనవి ఉన్నాయి. ఈ సారి హుండీలో రికార్డు స్థాయిలో బంగారం 480 గ్రాములు, వెండి 615 గ్రాములు లభించాయి. హుండీలో 58 డాలర్ల అమెరికా చెక్కు సాధారణంగా సత్యదేవుని హుండీలో డాలర్లు వస్తాయి. కానీ ఈ సారి ఓ అజ్ఞాతభక్తుడు సత్యదేవునికి 58 డాలర్ల చెక్ కూడా సమర్పించాడు. ఈ చెక్‌ను ఆన్లైన్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు కలెక్షన్‌కు పంపించాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో బాటు అమెరికా డాలర్లు 182, మలేషియా డాలర్లు 14, సౌదీ అరేబియా మోనాటరీలు రెండు, యూరోలు పది, నేపాలీ రూపాయలు 20, ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ పది రియల్స్, కెనడా డాలర్లు 25, సింగపూర్ డాలర్లు 5, యునైటెడ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దీనార్స్ పది, సౌతాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ ర్యాండ్స్ 430, ఆస్ట్రేలియా డాలర్లు వంద, బ్యాంక్ ఆఫ్ జమైకా డాలర్లు వంద లభించాయి. సత్యదేవుని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఇతర సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే మాఘమాసం నెల రోజులు ఎంత ఆదాయం వచ్చిందో అధికారికంగా ఒకట్రెండురోజుల్లో అధికారులు వెల్లడించనున్నారు.