ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
Published Tue, Jul 25 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM
స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం
శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి
ఆరుగురు వేదపండితులకు ఘన సత్కారం
వైభవంగా స్వామివారి వెండి రథోత్సవం
అన్నవరం(ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంత్యుత్సవాన్ని) శ్రావణశుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం పూర్ణాహుతి, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
పంచామృతాలతో స్వామికి అభిషేకం
స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి
దర్బారు మండపంలో నిర్వహిస్తున్న ఆయుష్యహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు, ఆలయ ఏఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరుగురు పండితులకు సత్కారం
సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేదాలలో నిష్ణాతులైన ఆరుగురు పండితులను దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు సత్కరించారు. రాజమండ్రికి చెందిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదపండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని లకు రూ.2500 చొప్పున పారితోషికం, పంచె కండువా, స్వామివారి ప్రసాదాలను బహూకరించి సత్కరించారు.
వెండి రథంపై స్వామివారి ఊరేగింపు
స్వామివారి ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు ఈ ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందకు పోటీపడ్డారు.
నేడు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం
మఖ నక్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారని పండితులు తెలిపారు. అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.
Advertisement