ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
Published Wed, Jul 26 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
-పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం
-భక్తులకు పవిత్రాల పంపిణీ
అన్నవరం (ప్రత్తిపాడు): రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న సత్యదేవుని 127వ ఆవిర్భావదినోత్సవాలు (జయంత్యుత్సవాలు) బుధవారం ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు.
Advertisement