jayanthithsavalu
-
ముగిసిన సత్యదేవుని జయంత్యుత్సవాలు
-పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం -భక్తులకు పవిత్రాల పంపిణీ అన్నవరం (ప్రత్తిపాడు): రత్నగిరిపై గత మూడు రోజులుగా వైభవంగా జరుగుతున్న సత్యదేవుని 127వ ఆవిర్భావదినోత్సవాలు (జయంత్యుత్సవాలు) బుధవారం ముగిశాయి. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ దర్బారు మండపంలో ఆయుష్యహోమం నిర్వహించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యుడు అవసరాల వీర్రాజు, ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు పాల్గొన్నారు. కాగా సత్యదేవుని సన్నిధిలో భక్తులు, అర్చక, పురోహిత, సిబ్బంది వలన తెలిసీ తెలియక జరిగే అపచారాల నివృత్తికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు కూడా బుధవారంతో ముగిశాయి. ఈ సందర్బంగా పవిత్రాలను (చేతులకు కట్టుకునే కంకణాల వంటివి) స్వామి సన్నిధిలో ఉంచి పూజలు చేసి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, యనమండ్ర శర్మ అవధాని, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. -
ఘనంగా సత్యదేవుని 127వ జయంత్యుత్సవం
స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి ఆరుగురు వేదపండితులకు ఘన సత్కారం వైభవంగా స్వామివారి వెండి రథోత్సవం అన్నవరం(ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని (జయంత్యుత్సవాన్ని) శ్రావణశుద్ధ విదియ మంగళవారం రత్నగిరిపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం, ఆయుష్యహోమం పూర్ణాహుతి, పండితులకు ఘన సత్కారం, రథోత్సవం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి అభిషేకం స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ఆయుష్యహోమం పూర్ణాహుతి దర్బారు మండపంలో నిర్వహిస్తున్న ఆయుష్యహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు, ఆలయ ఏఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణార్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆరుగురు పండితులకు సత్కారం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేదాలలో నిష్ణాతులైన ఆరుగురు పండితులను దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు సత్కరించారు. రాజమండ్రికి చెందిన మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వేదపండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, ఉప్పులూరి సత్యనారాయణ అవధాని, సింహాచలం దేవస్థానం వేదపండితులు కపిలవాయి వేంకటేశ్వర అవధాని, వడ్లమాని వేంకటేశ్వర అవధాని, పశ్చిమగోదావరి జిల్లా బోడపాడుకు చెందిన సత్యనారాయణ అవధాని లకు రూ.2500 చొప్పున పారితోషికం, పంచె కండువా, స్వామివారి ప్రసాదాలను బహూకరించి సత్కరించారు. వెండి రథంపై స్వామివారి ఊరేగింపు స్వామివారి ఆలయప్రాకారంలోని మాడావీధుల్లో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఈ ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితులు, అర్చకస్వాములు, పెద్దసంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందకు పోటీపడ్డారు. నేడు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం మఖ నక్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారని పండితులు తెలిపారు. అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్యహోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. -
సత్యదేవుని జయంత్యుత్సవం ప్రారంభం
-ఆయుష్య హోమానికి శ్రీకారం -నేడు, రేపు మూలవిరాట్‌కు అభిషేకాలు అన్నవరం (ప్రత్తిపాడు): శ్రీసత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలు( జయంత్యోత్సవాలు) శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవ పూజలను నిర్వహించే పండితులు, అర్చకస్వాములు, వంద మంది రుత్విక్కులకు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు వరుణలు, దీక్షావస్త్రాలను బహూకరించారు. మధ్యాహ్నం మండపారాధన, కలశస్థాపన, శ్రీసూక్త, పురుషసూక్త జపాలు, నవావరణ అర్చన, సువాసినీ పూజలు, లింగాష్టకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దిన వేడుకల్లో భాగంగా సత్యదేవుని ఆయుష్యహోమానికి పండితులు సోమవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మంత్రోచ్చరణల మధ్య కొయ్యల రాపిడితో హోమాగ్నిని వెలిగించి గుండంలో వేసి హోమాన్ని ప్రారంభించారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం బుధవారం జరుగుతుంది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించి పూజలు చేశాక దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మఖ న క్షత్రం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు.