ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
ఘనంగా సత్యదేవుని పుష్పయాగం
Published Thu, May 11 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
-స్వామి, అమ్మవార్లకు 9 పిండివంటల నివేదన
-విష్ణుమూర్తి, లక్ష్మీ అవతారాల్లో ఊయలసేవ
-ముగిసిన దివ్యకల్యాణ మహోత్సవాలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల చివరి రోజు వైశాఖ బహుళ పాడ్యమి గురువారం రాత్రి సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన అనివేటి మండపానికి సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లిపెద్దలు సీతారాములను ఊరేగింపుగా రాత్రి 7.30 గంటలకు తీసుకువచ్చారు. అక్కడ గల వెండి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను, ఆ సింహాసనం పక్కనే గల మరో ఆసనం మీద పెళ్లిపెద్దలు సీతారాములను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం పుష్పయాగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరపూజ చేశారు. అనంతరం పుణ్యాహవచనం మంత్రాలను పఠించారు. తరువాత పండితులు గర్భాదానం కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వíßహించారు. సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం చైర్మన్, ఈఓ నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత సర్వాంగసుందరంగా అలంకరించిన ఊయల మీద పవళించిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అవతారంలో సత్యదేవుడు, అమ్మవార్లను అలంకరించి పూజలు చేశారు. మొత్తం పది రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను సేవించారు. తొమ్మిది రకాల పిండివంటలను నివేదించి పండితుల మంత్రోఛ్చాటన మధ్య స్వామి, అమ్మవార్లు ఉన్న ఊయలను మూడు పర్యాయాలు ఊపారు. భక్తులు ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి పులకించారు. తరువాత ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులకు, వేదపండితుల దంపతులకు, ఈఓ దంపతులకు దంపత తాంబూలాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ రవికెలగుడ్డలను, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర అర్చకస్వాములు, పురోహితులు పాల్గొన్నారు.
Advertisement