- పంపా నదిలో నీరు లేక ఇబ్బంది
- బిందెతో నీరు తీసి కార్యక్రమం పూర్తిచేసిన పండితులు
అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు వైశాఖ బహుళ పాడ్యమి, బుధవారం ఉదయం సత్యదేవునికి పంపా నదిలో శ్రీ చక్ర స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములు ఊరేగింపుగా పంపా నదీ తీరంలో పవర్ హౌస్ వద్ద ఉన్న వేదిక వద్దకు తీసుకువచ్చి సింహాసనం మీద స్వామి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆ పక్కనే ఉన్న ఆసనంపై సీతా రాములను ప్రతిష్టించి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తరువాత ఊరేగింపుగా పంపా నది లోనికి తీసుకువెళ్లి నదీ జలాలతో పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామి వారికి, శ్రీ చక్రానికి స్నానం నిర్వహించారు. కార్యక్రమానికి దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె. నాగేశ్వరరావు, ఏసీ జగన్నా«ధరావు హాజరయ్యారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠి, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహతులు నాగాబట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, అర్చక స్వాములు కోట శ్రీను, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
అడుగులోతు నీటిలోనే శ్రీచక్ర స్నానం...
నదిలో నీరు అడుగు లోతు మాత్రమే ఉండడంతో బిందెలతో నీరు తోడి పోశారు. భక్తులు కూడా అరకొరగా నీళ్లు మీద పోసుకుని స్నానం అయిందనిపించారు. పంపా నదిలో చాలా రోజుల క్రితమే నీరు అడుగంటింది. రెండ్రోజుల కిందటే రెండు అడుగులు నీరు ఉండేలా ఇంజినీరింగ్ సిబ్బంది గొయ్యి తవ్వగా నీరు చేరినా విరగకాసిన ఎండలకు ఆ నీరు కాస్తా ఆవిరై పోయింది.
చిన్న పుష్కరణి వంటిది ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం...
ఎప్పుడూ నడి వేసవిలోనే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. భవిష్యత్‌లో కూడా ఇటువంటి నీటి సమస్య పునరావృతమయ్యే అవకాశాలున్నందున దేవస్థానం కనీసం మూడు సెంట్ల స్థలంలో ‘గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్’ (జీఎల్‌ఆర్)లాంటి ‘చిన్న పుష్కరణి ’ నిర్మించుకుని మోటార్లతో అందులో నీటిని నింపి శ్రీ చక్ర స్నానం నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం
- రత్నగిరిపై భక్తుల రద్దీ...గత మూడు రోజుల్లో 60 వేల మంది రాక
అన్నవరం: వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం రత్నగిరి వనదేవత శ్రీ వనదుర్గ అమ్మవారికి ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పండితులు అమ్మవారికి ఘనంగా పూజలు చేశారు. అనంతరం తొమ్మిది గంటలకు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు. పండితులు ఛామర్తి కన్నబాబు, అంగరసతీష్, సీహెచ్ ప్రసాద్, అర్చకస్వాములు చిట్టెం శ్రీహరగోపాల్, గంగాధరబట్ల శ్రీనివాస్ హోమం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ...
రత్నగిరిపై భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు, వివాహాల సీజన్ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పడుతోంది. సోమ, మంగళ. బుధ వారాలు మూడు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు ఆరువేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది.