మాఘం.. అమోఘం..
మాఘం.. అమోఘం..
Published Mon, Feb 27 2017 10:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
సత్యదేవునికి ‘కోట్లు’ కురిపించిన మాసం
హుండీల ద్వారానే రూ.1.11 కోట్ల ఆదాయం రాక
మిగిలిన విభాగాల ద్వారా మరో రూ.9 కోట్లు వచ్చే వీలు
హుండీ ఆదాయంలో మరలా పది నోట్లదే అగ్రతాంబూలం
అన్నవరం : రత్నగిరివాసుడు సత్యదేవునికి ఫిబ్రవరి నెలలో వచ్చిన మాఘమాసం దండిగా సిరులు కురిపించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ మాఘమాసంలో భక్తులు సత్యదేవుని సన్నిధికి పోటెత్తారు. ఫలితంగా రికార్డుస్థాయిలో సత్యదేవునికి హుండీల ద్వారా రూ.1,11,13,424 ఆదాయం వచ్చింది. సాధారణంగా హుండీ ఆదాయాన్ని అనుసరించి మిగిలిన విభాగాల ద్వారా ఆదాయం ఎలా వచ్చిందో అంచనా వేస్తారు. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 27 రోజులకుగాను భారీగా ఆదాయం రావడంతో మిగిలిన ఆదాయ వనరుల ద్వారా దేవస్థానానికి మరో రూ.తొమ్మిది కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సిరులు కురిపించే మాఘమాసం
సాధారణంగా సత్యదేవుని ఆలయానికి కార్తీకం, వైశాఖ మాసాల తరువాత మాఘాన్ని బాగా ఆదాయాన్ని తెచ్చే మాసంగా చెబుతారు. మాఘమాసంలో పెద్దసంఖ్యలో వివాహాలు జరగడం, నవదంపతులు, వారి బంధుమిత్రులు స్వామి సన్నిధికి తరలివచ్చి స్వామివారి వ్రతాలు ఆచరించి, దర్శించుకుంటారు. మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి, అదే విధంగా మాఘ ఆదివారాలు, దశమి, బహుళ ఏకాదశి వంటి పర్వదినాలలో భక్తులు అధికంగా రావడం వల్లే ఆదాయం భారీగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయంలో పది నోట్లే అధికం
సోమవారం లెక్కించిన హుండీ ఆదాయంలో 40 శాతానికి పైగా రూ.పది నోట్లే లభించాయి. మొత్తం హుండీ ఆదాయం రూ. 1,11,13,424 కాగా, అందులో కరెన్సీ 1,04,68,994. చిల్లర నాణేలు రూ.6,44,430. కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు విలువైన రూ.పది నోట్లే ఉండడం విశేషం. రూ.వంద నోట్లు రూ.45 లక్షలు విలువైనవి ఉన్నాయి. ఈ సారి హుండీలో రికార్డు స్థాయిలో బంగారం 480 గ్రాములు, వెండి 615 గ్రాములు లభించాయి.
హుండీలో 58 డాలర్ల అమెరికా చెక్కు
సాధారణంగా సత్యదేవుని హుండీలో డాలర్లు వస్తాయి. కానీ ఈ సారి ఓ అజ్ఞాతభక్తుడు సత్యదేవునికి 58 డాలర్ల చెక్ కూడా సమర్పించాడు. ఈ చెక్‌ను ఆన్‌లైన్‌లో అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు కలెక‌్షన్‌కు పంపించాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో బాటు అమెరికా డాలర్లు 182, మలేషియా డాలర్లు 14, సౌదీ అరేబియా మోనాటరీలు రెండు, యూరోలు పది, నేపాలీ రూపాయలు 20, ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ పది రియల్స్, కెనడా డాలర్లు 25, సింగపూర్ డాలర్లు 5, యునైటెడ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ దీనార్స్ పది, సౌతాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ ర్యాండ్స్ 430, ఆస్ట్రేలియా డాలర్లు వంద, బ్యాంక్ ఆఫ్ జమైకా డాలర్లు వంద లభించాయి. సత్యదేవుని హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఇతర సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే మాఘమాసం నెల రోజులు ఎంత ఆదాయం వచ్చిందో అధికారికంగా ఒకట్రెండురోజుల్లో అధికారులు వెల్లడించనున్నారు.
Advertisement
Advertisement