కొండకు కల్యాణశోభ
-సత్యదేవుని పెండ్లివేడుకకు ముస్తాబైన రత్నగిరి
-శనివారం రాత్రి 9.30 గంటల నుంచి పరిణయోత్సవం
అన్నవరం : సత్యదేవుని కల్యాణ వేడుకలకు రత్నగిరి ముస్తాబయింది. శుక్రవారం నుంచి ఈనెల 11 వరకూ జరగనున్న వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర«ధానాలయం, ఉపాలయాలు, కల్యాణ వేదిక, ఇతర కట్టడాలను, కొండ దిగువన వివిధ సత్రాలనూ రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎండ తగలకుండా ప్రధానాలయం చుట్టూ షామియానాలు వేయించారు. అన్నవరంలో పలు చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు, ఫెక్ల్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో సత్యదేవుని ప్రచారరథం ద్వారా కల్యాణ మహోత్సవాల గురించి ప్రచారం చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేయడంతో కల్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని దూరదర్శన్, టీటీడీ చానల్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
ఊరేగింపునకు వాహనాలు సిద్ధం
శుక్రవారం నుంచి మంగళవారం వరకూ కొండ దిగువన పెళ్లిపెద్దలు శ్రీసీతారాములతో పాటు సత్యదేవుడు, అమ్మవార్లను వివిధవాహనాలలో ఊరేగించనున్నారు. ఆ వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధ చేశారు. రావణబ్రహ్మ, పొన్నచెట్టు వాహనాలకు రంగులు వేసి ఊరేగింపునకు సిద్దం చేశారు. ఊరేగింపు జరిగే ఐదు రోజులు అన్నవరం మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా ప్రత్తిపాడు సీఐ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో పాల్గొననున్నారు. కల్యాణం రోజున నలుగురు ఎస్‌ఐలు, వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు.
స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
కల్యాణోత్సవాల ఏడు రోజులు స్థానిక కళాకారులతో భక్తిరంజని, హరికథ, బుర్రకథ, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పౌరాణిక నాటకాలను ఈ ఏడాది కూడా రద్దు చేశారు.