బాలుడి మృతదేహం లభ్యం
బాలుడి మృతదేహం లభ్యం
Published Thu, Jun 22 2017 5:54 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
గోపాలపురం: గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామంలో పోలవరం కుడి కాలువలో కాలుజారి పడి గల్లంతైన కౌలూరి చరణ్ (11) మృతదేహాన్ని గురువారం గ్రామస్తులు వెలికితీశారు. చరణ్ తన అన్న కల్యాణ్, స్నేహితుడు హేమంత్‌తో కలిసి బుధవారం బహిర్భూమికి వచ్చి ప్రమాదవశాత్తు కాలుజారిపడిన సంగతి తెలిసిందే. పోలవరం కాలువ వద్ద 200 మీటర్ల లోతులో బాలుడి మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించి బయటకు తీసుకువచ్చారు. బాలుడి తల్లి లక్ష్మి, అన్న కల్యాణ్, చెల్లెలు కావ్య మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. భర్త చనిపోయిన ఆరు నెలలకే కొడుకును కూడా కోల్పోవడం లక్ష్మికి తీరని శోకాన్ని మిగిల్చింది.
బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎమ్మార్పీఎస్
పోలవరం కుడి కాలువలో నీరు వదులుతున్నట్టు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం లేదని, నెల రోజులుగా కాలువలో పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు తానేటి స్టీఫెన్, సిర్రా కృష్ణ మాదిగ అన్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు బహిర్భూమికి వెళ్లడంతో చరణ్ మృత్యవాత పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చరణ్ మృతిచెందాడని, బాలుడి కుటుంబసభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై యు.లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement