బందో‘మస్తు’
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రత
కర్నూలు : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండటంతో పాటు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలని, పోలింగ్ రోజు ఓటింగ్‌కు అంతరాయం కల్గించేవారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల సమయంలో గుంపులుగుంపులుగా చేరకుండా చూడాలన్నారు.
చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు బాగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘాను పటిష్టపరచాలన్నారు. జిల్లాలో అక్రమ మద్యం, డబ్బు, మారణాయుధాలు, అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసివుంటే డయల్ 100కు గాని, స్థానిక పోలీసులకు గాని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు గాని, నేరుగా తనకు గాని సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలు, మీడియా, జిల్లా అధికార యంత్రాంగానికి సహాయసహకారాలు అందించాలని ఎస్పీ కోరారు.
నగరంలో పోలీసు కవాతు...
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పోలీసులు నగరంలో కవాతు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఎస్పీ ఆకే రవికృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, నాగరాజరావు, నాగరాజు యాదవ్‌తో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు.