bandobast
-
గ్రేటర్ పోరు: భారీ బందోబస్తు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాచకొండ పరిధిలో 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయని వెల్లడించారు. 1072 సాధారణ, 512 సమస్యత్మక, 53 అతి సమస్యత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ఆ వదంతులు నమ్మకండి) 29 చెక్‌పోస్ట్‌లు, 90 పికెట్స్, 104 వాహనాలు ఏర్పాటు చేసి నిఘా పట్టిష్టం చేశామని పేర్కొన్నారు. ఆరు ఫ్లెయింగ్ స్క్వాడ్, ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 533 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో దూషణలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. 353 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 10 మోంటెడ్ కెమెరా వాహనాలతో నిఘా పటిష్టం చేశామని పేర్కొన్నారు. 89 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, 140 నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని కమిషనర్ పేర్కొన్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..) -
గ్రేటర్ ఎన్నికలు: భారీ బందోబస్తు..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం ఆయన గ్రేటర్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. 2,569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సైబరాబాద్ పరిధిలో 770 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్‌కి ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. (చదవండి: గ్రేటర్ వార్: ముగిసిన నామినేషన్ల పర్వం) 13,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 186 మందిని బైండోవర్ చేశామని, 157 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ‘‘15 చెక్‌పోస్ట్, 11 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 10 కెమెరా మోంటెడ్ వెహికల్ ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. సైబరాబాద్‌లో ఉన్న లక్ష కెమెరాలను యాక్టివ్ చేసి నిఘా పట్టిష్టం చేశామని’’ సీపీ సజ్జనార్ వెల్లడించారు. (చదవండి: బరిలో టీఆర్ఎస్ గెలుపు గుర్రాలు!) -
హుజుర్నగర్ ఉప ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు
సాక్షి, సూర్యాపేట: ఓటర్లకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హుజుర్నగర్ పోలీస్ స్టేషన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు సందర్భంగా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉందని..13 చెక్‌పోస్ట్‌ల్లో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి స్పెషల్ స్ట్రికింగ్ ఫోర్స్, ఎంసీసీ బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఎన్నికల కోడ్, పోలీసు యాక్ట్ అమలులో ఉందని.. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఐదు పారా మిలిటరీ బృందాలను రప్పిస్తున్నామన్నారు. 36 ప్రాంతాల్లో 76 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని..21 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి 650 మంది పోలీసు సిబ్బంది విధులకు హాజరవుతారని చెప్పారు. ఏడు ఎస్ఎస్టీ, నాలుగు వీడియో బృందాలు ఏర్పాటు చేసామని.. ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి నిఘా పెట్టామన్నారు. -
దసరా ఉత్సవాలకు కట్టుదిట్ట ఏర్పాట్లు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో దసరా ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించామని వెల్లడించారు. 29న ఆదివారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. మూల నక్షత్రం రోజున 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనేదే లక్ష్యమని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక సమయాలు కేటాయించామని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, ఉదయం 11 నుంచి 12 గంటల వరుకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరుకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. విఐపిలతో పాటు సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. విఐపి ప్రోటోకాల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్, పున్నమి ఘాట్, ప్రోటోకాల్ పాయింట్స్ లను విఐపిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘దసరా పార్కింగ్ యాప్- 2019’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ యాప్‌తో పార్కింగ్ సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్‌లో మోబి జెన్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 12 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అమ్మవారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామన్నారు. గత ఏడాది ఎక్కడా చోరీలు జరగలేదని. ఈ ఏడాది కూడా క్రైం పార్టీలను పెంచుతామన్నారు. దాతలకు కూడా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసామని.. 10 రోజుల్లో ఏ రోజు అయినా దర్శనం చేసుకోవచ్చన్నారు 90 శాతం ఏర్పాట్లు పూర్తి:ఈవో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో సురేష్‌బాబు అన్నారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కేశన ఖండనశాల పనులు పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. క్యూలైన్ పనులు రేపటికి పూర్తవుతాయని..అన్యమతస్థులకు టెండర్లు ఇవ్వలేదని ఈవో తెలిపారు. -
‘కాప్పాన్’తో సూర్య అభిమానులు ఖుషీ
చాలా కాలం తరువాత నటుడు సూర్య అభిమానుల్లో ఆనందం తాండవిస్తోంది. కారణం సూర్య నటించిన తాజా చిత్రం కాప్పాన్. సూర్యకు జంటగా నటి సాయేషా సైగల్ నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య ప్రదాన పాత్రలను పోషించారు. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. శుక్రవారం భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన కాప్పాన్ చిత్రం సూర్య అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పలు ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా ఈయన కాప్పాన్ చిత్రంలోనూ తనదైన దర్శకత్వ శైలిని ప్రదర్శించారు. సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా మోహన్‌లాల్ పడే తపన, అందు కోసం చేసే కృషి, పాకిస్థాన్ ఉగ్రవాదుల దురాగతాలు, స్వదేశంలోని కార్పొరేట్ల స్వార్థం, కొందరు మంత్రుల అక్రమ రాజకీయాలు, బయోవార్, రైతుల సంరక్షణ, ప్రేమ వంటి అంశాలను టచ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులు తన స్వార్థం కోసం రైతుల కడుపు కొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రధాని అంగీకరించకపోవడంతో ఆయన్నే మట్టు పెట్టే ప్రయత్నానికి పాల్పడతారు. దాన్ని ప్రధాని సెక్యూరిటీ సూర్య ఎలా ఎదుర్కొన్నాడు..? రైతుల భూములను ఎలా కాపాడాడు? లాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కాప్పాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సూర్య తనదైన శైలిలో ఆకట్టకున్నారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రిగా హుందాగా నటించారు. కథానాయకిగా నటి సాయేషా సైగల్ తన పరిధిలో నటించింది. ఆర్య తనదైన హాస్యధోరణిలో కథలో కీలకంగా నిలిచారు. చిత్రానికి ఛాయాగ్రహణ హైలైట్. హరీస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చింది. -
పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్
పెళ్లికి తాను సిద్ధంగా ఉన్నానని అంటోంది నటి పూర్ణ. ఈ మలయాళ భామ మంచి నటి, అంతకంటే మంచి డ్యాన్సరు. వివిధ భాషా చిత్రాల్లో కథానాయకిగా నటించిన పూర్ణ ఇప్పుడు కథానాయకిగానే కాదు పాత్ర బాగుంటే సపోర్టింగ్ రోల్స్ చేయడానికీ సిద్ధం అంటోంది. ఈ మధ్య ‘సువరకత్త’చిత్రంలో చాలా చక్కని నటన ప్రదర్శించి పేరు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం ‘బ్లూవేల్’అనే చిత్రంలో పోలీస్ అధికారిణిగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్) చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. సాయేషా సైగల్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి పూర్ణ మీడియా ముచ్చటించారు. కాప్పాన్ చిత్రంలో నటించిన అనుభవం గురించి? కాప్పాన్ చిత్రంలో నటుడు సముద్రఖనికి జంటగా నటించాను. పాత్ర చిన్నదే అయినా సంతృప్తినిచ్చింది. ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. భారీ చిత్రంలో నటించాలన్న ఆశ కాప్పాన్తో తీరింది. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కారణం? చాలా చిత్రాల్లో హీరోయిన్గా నటించాను. అలాంటిది సమీప కాలంలో కథానాయకిగానే నటించాలన్న ఆలోచన మారింది. పాత్రలో కొత్తదనం ఉందనిపిస్తే అది ఎలాంటిదైనా చేయడానికి వెనుకాడటం లేదు. చిత్రంలో అన్ని పాత్రలు ముఖ్యమే అవుతాయి. కొన్ని పాత్రలు కథానాయకి పాత్ర కంటే మంచి పేరు తెచ్చి పెడతాయి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు? తమిళంలో బ్లూవేల్ చిత్రంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను. బ్లూవేల్ చిత్రం గురించి? ఇది లో బడ్జెట్లో రూపొందిస్తున్న చిత్రమే కానీ, బ్లూవేల్ గేమ్ గురించి అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుంది. ఇందులో పోలీస్ అధికారిణిగా, ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నాను. చిత్రంలో పోరాట సన్నివేశాల కంటే ఎమోషనల్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. అవార్డుల ఆశతో పాత్రలను ఎంచుకుంటున్నారా? నేనెప్పుడూ అవార్డుల కోసమే నటించలేదు. పారితోషికం కూడా ముఖ్యమే. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలకు కూడా మంచి పారితోషికం లభిస్తోంది. నాకు జీవితాంతం నటించాలని ఆశ. అయితే అది నా కుటుంబాన్ని బట్టి ఉంటుంది. కాప్పాన్ చిత్రంలో నా నటన కోసమే సంప్రదించారు. అలాంటి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ. పెళ్లెప్పుడు చేసుకుంటారు? పెళ్లి జీవితంలో ముఖ్యమైనది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సరైన సమయంలో చేసుకోవాలి. కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక ఆ భగవంతుడే నిర్ణయించాలి. నా వివాహ రిసేప్షన్ మాత్రం కచ్చితంగా చెన్నైలోనే ఏర్పాటు చేస్తాను. -
అభిమానులకు సూర్య విన్నపం
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బందోబస్త్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో పాటు ఆర్య, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న హీరో సూర్య అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. (చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్) ఇటీవల చెన్నైలో ఫ్లెక్సీ బ్యానర్ పడి సాఫ్ట్‌పేర్ ఉద్యోగిని శుభశ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమా కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూర్య అభిమానులను కోరాడు. ఫ్లెక్సీ కారణంగా ప్రమాదాలు జరగటమే కాదు, పర్యావరణానికి కూడా హాని జరుగుతుందన్న సూర్య, ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరాడు సూర్య. -
‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. తమిళంలో ‘కాప్పాన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు రంగం ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు నవాబ్, 2.0 చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కీలక పాత్రలో ఆర్య, సయేషాలు నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బందోబస్త్ తమిళ వెర్షన్ కాప్పాన్ పాటలు ఇటీవలే సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదల అయ్యాయి. త్వరలో తెలుగు వెర్షన్ పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ గెటప్పుల్లో సూర్య నటన, పాకిస్తాన్ తీరును ఎండగడుతూ మోహన్‌లాల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, కథా నేపథ్యం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు సన్ నెట్వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. -
‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని..’
గత కొన్నేళ్లుగా సూర్య చిత్రాలు సరైన విజయాన్ని నమోదు చేయలేకపోతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఎన్జీకే చిత్రం కూడా ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బందోబస్త్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి చేస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. రానా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని.. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు’ లాంటి డైలాగ్‌లు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఆర్య, సాయేషా, బొమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటించగా.. కేవీ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు హారీస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది. -
ఎన్నికల నిర్వాహణకు పోలీస్ యంత్రాంగం సిద్ధం
-
బందో‘మస్తు’
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట భద్రత కర్నూలు : పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండటంతో పాటు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే సిబ్బంది మర్యాదపూర్వకంగా మసలుకోవాలని, పోలింగ్ రోజు ఓటింగ్‌కు అంతరాయం కల్గించేవారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల సమయంలో గుంపులుగుంపులుగా చేరకుండా చూడాలన్నారు. చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు బాగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘాను పటిష్టపరచాలన్నారు. జిల్లాలో అక్రమ మద్యం, డబ్బు, మారణాయుధాలు, అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసివుంటే డయల్ 100కు గాని, స్థానిక పోలీసులకు గాని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు గాని, నేరుగా తనకు గాని సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలు, మీడియా, జిల్లా అధికార యంత్రాంగానికి సహాయసహకారాలు అందించాలని ఎస్పీ కోరారు. నగరంలో పోలీసు కవాతు... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పోలీసులు నగరంలో కవాతు నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఎస్పీ ఆకే రవికృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, నాగరాజరావు, నాగరాజు యాదవ్‌తో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస
– గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి కడప అర్బన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటిస్తుండటంతో బందోబస్తు విధులకు వచ్చిన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన కానిస్టేబుల్ శాంతకుమార్(45) గుండెపోటుతో మరణించారు. నందికొట్కూరుకు చెందిన శాంతకుమార్(పీసీ నెంబర్ 308) 1993 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఏడాది కాలంగా జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో పని చేస్తున్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేట, కడపలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో స్థానిక పోలీసులతో పాటు కర్నూలు జిల్లా నుంచీ బందోబస్తు విధులకు పోలీసులను తరలించారు. ఆ మేరకు శుక్రవారం సహచర పోలీసులతో కలిసి శాంతకుమార్ కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న ఆయన మరో ఆరుగురు సహచరులతో కలిసి ఓ రూంను అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం కడప మార్కెట్ యార్డు వద్దకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతితో టిఫిన్ చేసి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫిట్స్‌గా భావించిన సహచరులు 108కు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ డీఎస్పీ ఓ వాహనంలో సమీపంలోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శాంతకుమార్ మృతదేహాన్ని కర్నూలు-కడప రేంజ్ డీఐజీ రమణకుమార్ సందర్శించి నివాళులర్పించారు. కానిస్టేబుల్ మృతికి సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
భారీబందోబస్తు
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకొని హోళగుంద మండలం దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు 41 మంది, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు 145 మంది, కానిస్టేబుళ్లు 458, స్పెషల్‌పార్టీ పోలీసులు 70 మంది, హోంగార్డులు 200 మందిని బందోబస్తు విధులకు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, మఫ్టీ, స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ బన్ని ఉత్సవంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా ప్రతి ఒక్కరు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆకతాయిలు, అల్లరి మూకలు దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలపై, చిన్న పిల్లలపై, భక్తులకు నిప్పులు విసరడం, కర్రలతో రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిని వీడియో చిత్రీకరణ ద్వారా గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.