సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో దసరా ఏర్పాట్ల గురించి ఆయన వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతర జిల్లాల నుంచి బలగాలను రప్పించామని వెల్లడించారు. 29న ఆదివారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని సీపీ తెలిపారు. మూల నక్షత్రం రోజున 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనేదే లక్ష్యమని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. రెవెన్యూ, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్షలు నిర్వహించామని తెలిపారు. విఐపిలకు ప్రత్యేక సమయాలు కేటాయించామని వెల్లడించారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, ఉదయం 11 నుంచి 12 గంటల వరుకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల వరుకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. విఐపిలతో పాటు సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. విఐపి ప్రోటోకాల్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్, పున్నమి ఘాట్, ప్రోటోకాల్ పాయింట్స్ లను విఐపిలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘దసరా పార్కింగ్ యాప్- 2019’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఈ యాప్‌తో పార్కింగ్ సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్‌లో మోబి జెన్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 12 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలీస్, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు అమ్మవారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామన్నారు. గత ఏడాది ఎక్కడా చోరీలు జరగలేదని. ఈ ఏడాది కూడా క్రైం పార్టీలను పెంచుతామన్నారు. దాతలకు కూడా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేసామని.. 10 రోజుల్లో ఏ రోజు అయినా దర్శనం చేసుకోవచ్చన్నారు
90 శాతం ఏర్పాట్లు పూర్తి:ఈవో
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈవో సురేష్‌బాబు అన్నారు. 90 శాతం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కేశన ఖండనశాల పనులు పూర్తిచేస్తున్నామని వెల్లడించారు. క్యూలైన్ పనులు రేపటికి పూర్తవుతాయని..అన్యమతస్థులకు టెండర్లు ఇవ్వలేదని ఈవో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment