విధి నిర్వహణలోనే తుదిశ్వాస
విధి నిర్వహణలోనే తుదిశ్వాస
Published Sat, Nov 26 2016 11:07 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– గుండె పోటుతో కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో పర్యటిస్తుండటంతో బందోబస్తు విధులకు వచ్చిన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన కానిస్టేబుల్ శాంతకుమార్(45) గుండెపోటుతో మరణించారు. నందికొట్కూరుకు చెందిన శాంతకుమార్(పీసీ నెంబర్ 308) 1993 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఏడాది కాలంగా జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్నారు. శనివారం వైఎస్‌ఆర్ జిల్లాలోని రాజంపేట, కడపలో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో స్థానిక పోలీసులతో పాటు కర్నూలు జిల్లా నుంచీ బందోబస్తు విధులకు పోలీసులను తరలించారు. ఆ మేరకు శుక్రవారం సహచర పోలీసులతో కలిసి శాంతకుమార్ కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్న ఆయన మరో ఆరుగురు సహచరులతో కలిసి ఓ రూంను అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం కడప మార్కెట్ యార్డు వద్దకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతితో టిఫిన్ చేసి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫిట్స్‌గా భావించిన సహచరులు 108కు సమాచారం అందించారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ డీఎస్పీ ఓ వాహనంలో సమీపంలోని శ్రీనివాస ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శాంతకుమార్ మృతదేహాన్ని కర్నూలు-కడప రేంజ్ డీఐజీ రమణకుమార్ సందర్శించి నివాళులర్పించారు. కానిస్టేబుల్ మృతికి సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Advertisement
Advertisement