చాలా కాలం తరువాత నటుడు సూర్య అభిమానుల్లో ఆనందం తాండవిస్తోంది. కారణం సూర్య నటించిన తాజా చిత్రం కాప్పాన్. సూర్యకు జంటగా నటి సాయేషా సైగల్ నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య ప్రదాన పాత్రలను పోషించారు. కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది. శుక్రవారం భారీ అంచనాల మధ్య తెరపైకి వచ్చిన కాప్పాన్ చిత్రం సూర్య అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది.
ఈ చిత్రానికి దర్శకుడు కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పలు ఆసక్తికరమైన మలుపులతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా ఈయన కాప్పాన్ చిత్రంలోనూ తనదైన దర్శకత్వ శైలిని ప్రదర్శించారు. సినిమాలో దర్శకుడు చాలా విషయాలను చెప్పారు. దేశ భద్రత, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా మోహన్‌లాల్ పడే తపన, అందు కోసం చేసే కృషి, పాకిస్థాన్ ఉగ్రవాదుల దురాగతాలు, స్వదేశంలోని కార్పొరేట్ల స్వార్థం, కొందరు మంత్రుల అక్రమ రాజకీయాలు, బయోవార్, రైతుల సంరక్షణ, ప్రేమ వంటి అంశాలను టచ్ చేశారు.
బడా కార్పొరేట్ శక్తులు తన స్వార్థం కోసం రైతుల కడుపు కొట్టాలని ప్రయత్నిస్తారు. అందుకు ప్రధాని అంగీకరించకపోవడంతో ఆయన్నే మట్టు పెట్టే ప్రయత్నానికి పాల్పడతారు. దాన్ని ప్రధాని సెక్యూరిటీ సూర్య ఎలా ఎదుర్కొన్నాడు..? రైతుల భూములను ఎలా కాపాడాడు? లాంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో కాప్పాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సూర్య తనదైన శైలిలో ఆకట్టకున్నారు.
మోహన్‌లాల్ ప్రధానమంత్రిగా హుందాగా నటించారు. కథానాయకిగా నటి సాయేషా సైగల్ తన పరిధిలో నటించింది. ఆర్య తనదైన హాస్యధోరణిలో కథలో కీలకంగా నిలిచారు. చిత్రానికి ఛాయాగ్రహణ హైలైట్. హరీస్ జయరాజ్ నేపథ్య సంగీతం బాగా కలిసివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment