బ్యాంకు ఉద్యోగి దారుణహత్య
-
బావను గొడ్డలితో నరికి కడతేర్చిన బావమరిది
గూడూరు : గొడవలతో విడిపోయి ఉన్న అక్కా, బావలను కలిపి వారి కాపురం చక్కబెట్టాల్సిన తమ్ముడే.. బావను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి, తన సోదరి ఐదోతనాన్ని కాలరాశాడు. స్వయానా తన అక్క భర్త అయిన రఘు (54)ను అతడి బావమరిది రవి గొడ్డలితో నరికి చంపి పరారైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జానకిరాంపేటకు చెందిన గంగాబత్తిన లింగయ్య, సుబ్బమ్మల కుమార్తె మహేశ్వరిని సంగీతం రఘుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. రఘు విద్యానగర్‌లో కాపురం ఉంటూ వాకాడులోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నినెలల క్రితం రఘుకు అతని భార్యకు మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. ఈ క్రమంలో రఘు వేరుగా ఒక గదిని అద్దెకు తీసుకుని ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్వరి పుట్టింటివారే వేరుగా ఎందుకుంటావని రఘుకు చెప్పి నాలుగునెలల క్రితం గూడూరుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రఘు గూడూరు నుంచి రోజూ బ్యాంకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రఘుకు అతని బావమరిది రవికి మధ్య గొడవ జరిగింది. రవి సోదరుడు ఈశ్వరయ్య, అతని భార్య సుజాతలతోపాటు తల్లి సుబ్బమ్మ వారి వద్దకు వచ్చి సర్ధిచెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ నిద్రిస్తున్న రఘుపై రవి గొడ్డలితో దాడిచేయగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సుబ్బారావు, ఎస్సై నరేస్‌లు చేరుకుని పరిశీలించారు. వివరాలు విచారించి కేసు నమోదు చేశారు.
గతంలోనూ ఇంతే..
రవి గతంలో కూడా తన కన్న తండ్రి లింగయ్యపైనే కత్తితో దాడి చేసి నరికి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే రవిపై సస్పెక్టడ్ షీట్ కూడా ఉన్నట్లు ఎస్సై నరేష్ వెల్లడించారు.