బ్యాంకులకు మూడు రోజుల సెలవులు
బ్యాంకులకు మూడు రోజుల సెలవులు
Published Thu, Dec 8 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
ఆందోళనలో ప్రజలు
ప్రశార్ధకంగా మారనున్న నగదు లభ్యత
ఏటీఎంలు పనిచేస్తాయా?
జంగారెడ్డిగూడెం:
బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నెల 10వ తేదీ రెండవ శనివారం , 11వ తేదీ ఆదివారం, 12వ తేదీ సోమవారం ఈద్‌ఎమిలాద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవులు వచ్చాయి. తొలుత 13వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ దానిని 12వ తేదీ కి మార్పు చేసింది. దీంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. నోట్ల రద్దు తరువాత ప్రజలకు నగదు కష్టాలు తీరలేదు. ఈ నెల ప్రారంభమైన వారం దాటినా ఉద్యోగులకు జీతాలు అందక చేతిలో నగదు లేక నానా అవస్ధలు పడుతున్నారు. ఉదయం నుంచే బ్యాంకుల ఏటీఎం వద్ద క్యూలు కడుతున్నారు. అయితే నగదు నిండుకోవడంతో మధ్యాహ్న సమయానికే బ్యాంకులు, ఏటీఎంలు మూసివేస్తున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం ఒక్కరోజే నగదును తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వరుస సెలవులు నేపధ్యంలో కనీసం ఏటీఎంలోనైనా బ్యాంకులు నగదు ఉంచుతాయా? లేదా? అనేది ప్రశ్నార్ధకం. బ్యాంకుల్లో నగదు నిండుకోవడంతో ఏటీఎంలో నగదు పెట్టే విషయం కూడా అనుమానమేఅని చెబుతున్నారు. అంతేగాక గత నెల రోజులుగా బ్యాంకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల్లో ఖాతాదారుల తాకిడి నేపధ్యంలో విరామం లేకుండా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రజల వద్ద సొమ్ములు లేకపోవడంతో ఇప్పటికే అన్ని రకాల వ్యాపారాలు పడిపోగా, వరుసగా మూడు రోజుల సెలవులు మరింత డీలా పడిపోయే అవకాశం ఉందని అన్ని రకాల వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.
Advertisement