ఆయన మాట.. ముంచె నట్టేట! | bank notice | Sakshi
Sakshi News home page

ఆయన మాట.. ముంచె నట్టేట!

Published Sat, Sep 3 2016 10:02 PM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

ఆయన మాట.. ముంచె నట్టేట! - Sakshi

ఆయన మాట.. ముంచె నట్టేట!

  • డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల బెదిరింపులు
  • ఆస్తులు జప్తు అంటూ బ్యాంకు నోటీసులు
  • బెంబేలెత్తుతున్న డ్వాక్రా మహిళలు
  • వైఎస్సార్‌ సీపీ నేతల వద్ద ఆవేదన
  •  
     
    ‘సకాలంలో వాయిదాలు కట్టకపోవడం వల్ల మీకు వడ్డీ రాయితీ రాకపోవడంతో పాటు చట్టరీత్యా తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే అవకాశంతో పాటు అర్హత కోల్పోతారు. బాకీ వసూలుకు కోర్టు, పోలీసు, రెవెన్యూ వారి సహకారంతో మీ ఆస్తులు, సామగ్రి, ఇతర వస్తువులను జప్తు చేస్తాం.’ – డ్వాక్రా రుణాలు చెల్లించాలంటూ మండపేట మండలం తాపేశ్వరంలోని ఐఓబీ ఇచ్చిన నోటీసు సారాంశమిది.
    – మండపేట
     
    డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది నేనేనని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పుడు ఆ సంఘాలను నిండా ముంచారు. రుణమాఫీ జరగక వడ్డీతో కలి పి రుణభారం పెరిగిపోగా, తిరిగి చెల్లించకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. నమ్మి ఓట్లేస్తే, కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే మండలంలోని తాపేశ్వరంలో డ్వాక్రా మహిళలకు కోర్టు ద్వారా బ్యాంకు నోటీసులు జారీ చేయగా, జిల్లాలోని పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.
    మాట మార్చిన బాబు
    డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తాం, బకాయిలు ఎవరూ చెల్లించనవసరం లేదంటూ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం డ్వాక్రా సంఘాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు హామీని నమ్మి ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు నుంచీ మహిళలు రుణాలు చెల్లించడం మానేశారు. అధికారంలోకి వచ్చాక రుణాలన్నీ రద్దు కావు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వరకు భారం మాత్రమే తగ్గిస్తామంటూ మాటమార్చారు. ఆ మొత్తాన్ని మూడు దఫాలుగా పొదుపు ఖాతాలకు జమ చేస్తామనడంతో కంగుతినడం మహిళల వంతైంది. వారి అప్పులపై వడ్డీ భారం పెరిగిపోయింది.
    బ్యాంకుల వేధింపులు
    జిల్లావ్యాప్తంగా అర్బన్‌ ప్రాంతాల్లో సుమారు 18 వేల గ్రూపులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 77,800 సంఘాలున్నాయి. అధిక శాతం సంఘాలు వడ్డీ రాయితీకి దూరమయ్యాయి. పాత బకాయిలు పేరుకుపోయాయంటూ కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు విముఖత చూపుతుండటంతో, రుణ లక్ష్యాలను చేరుకోవడం గగనంగా మారింది. పొదుపు ఖాతాల్లోని సొమ్మును వడ్డీకి జమ చేసుకుంటున్నారని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామంటూ ఇప్పటికే మండపేట మండలం తాపేశ్వరంలోని బ్యాంకు అధికారులు డ్వాక్రా సంఘాలకు కోర్టు నోటీసులు జారీచేయడం వెలుగుచూసింది.
    నమ్మించి మోసగించారు : వైఎస్సార్‌ సీపీ నేతల వద్ద ఆవేదన
    రుణాలు మాఫీ చేస్తామంటూ నమ్మించి మోసగించారని తాపేశ్వరంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పొదుపు సొమ్మును వడ్డీగా జమ చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రెండు రోజుల క్రితం డ్వాక్రా మహిళలను కలిశారు. బ్యాంకు నుంచి వచ్చిన కోర్టు నోటీసులను మహిళలు వారికి చూపించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి డ్వాక్రా మహిళలను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. అధైర్యపడవద్దని, రుణమాఫీ హామీ అమలుకు అధికార పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు వారి వెంట ఉన్నారు.
     
    నమ్మి ఓట్లేస్తే.. నోటీసులిప్పిస్తున్నారు
    గతంలో సకాలంలో రుణాలు చెల్లించేవాళ్లం. రుణమాఫీ చేయక అసలు, వడ్డీ కలిపి రుణభారం బాగా పెరిగిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే మాకు కోర్టు నోటీసులు ఇప్పిస్తున్నారు.
    – దొండపాటి సరస్వతి, తాపేశ్వరం
    ఇళ్లకు తాళాలు వేస్తామంటున్నారు
    రుణాలు చెల్లించకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. మా ఖాతాలోని పొదుపు సొమ్మును కూడా వడ్డీగా జమ చేసుకున్నారు. తరచూ వచ్చి మమ్మిల్ని బెదిరించి వెళుతున్నారు. రేషన్‌ సరుకులు, మీ పిల్లల స్కాలర్‌షిప్‌లు, పింఛను సాయాన్ని ఆపేస్తామంటున్నారు.  – కౌరోజు మంగ, తాపేశ్వరం
    చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు
    రుణాలు రద్దయిపోతాయి, కట్టొద్దని చెప్పడం వల్లే చెల్లించలేదని చెబితే, మాకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రు ణాలు కట్టొద్దని చెప్పిన వారిని తీసుకురమ్మంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాం.    – తాతపూడి పాప, తాపేశ్వరం
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement