సజావుగా ఎమ్మెల్సీ ఎన్నిక
వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
కాకినాడ సిటీ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఎన్నికను సజావుగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచించారు. ఇరురాష్ట్రాలలో జరుగనున్న శాసనమండలి అభ్యర్థుల ఎన్నికలపై గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని దీనిపై నివేదికలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు సంబంధించి జిల్లాలో ఏడు పోలింగ్ కేంద్రాలలో రెండు రంపచోడవరం, ఎటపాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పరిశీలించేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించామని, మండల స్థాయిలో అధికారులను నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏడు జోన్లకు అధికారులను నియమించడంతో పాటు ఓట్ల లెక్కింపునకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఎస్.రవిప్రకాష్ బందోబస్తు ఏర్పాట్లను వివరిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రంపచోడవరం, ఎటపాక డివిజన్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణ కోసం రెండు కంపెనీల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో చెన్నకేశవరావు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రత్యేకాధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి పాల్గొన్నారు.