
భూ సేకరణ అస్త్రం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ భూ సేకరణకు తొలి అడుగు పడింది.
⇒మెట్రో ప్రాజెక్ట్‌కు భూముల కోసం ప్రాథమిక ప్రకటన విడుదల
⇒76.92 ఎకరాలు అవసరం
⇒పంతం నెగ్గించుకునేందుకు ప్రభుత్వ ప్రయత్నం
⇒న్యాయ పోరాటానికి భూ యజమానులు సిద్ధం
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ భూ సేకరణకు తొలి అడుగు పడింది. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీకాంతం సోమవారం భూసేకరణకు ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన మార్గంలో మెట్రో ప్రాజెక్ట్‌కు భూములు ఇచ్చేందుకు యజమానులు మొదటి నుంచి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు భూసేకరణకు సిద్ధమైంది. కలెక్టర్ ప్రకటన విషయం తెలియడంతో భూ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
రెండు కారిడార్లు... 26 కిలో మీటర్లు
నగరంలోని రెండు కారిడార్లు (ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు)లో 26 కిలో మీటర్లు మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 76.92 ఎకరాల భూమి అవసరమని అధికారులు నిర్ణయించారు. ఈ భూమి సేకరించేందుకు ఒకే ప్రకటన ఒకేచోట కాకుండా... ఏయే ప్రాంతాల్లో ఏ యజమాని నుంచి ఎంత భూమి సేకరిస్తున్నారో తెలియజేస్తూ విడివిడిగా ప్రకటన జారీ చేశారు. భూసేకరణలో ఎక్కువ భాగం సుమారు 50 ఎకరాలు మెట్రో కోచ్ ప్యాక్టరీకే అవసరం. ఈ ప్యాక్టరీని నిడమానూరులో ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన భూమిని సేకరించి 24 మెట్రో స్టేషన్లు నిర్మిస్తారు. ఇందుకోసం ఏలూరు రోడ్డు, బందరురోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లును తొలగించి అక్కడ పిల్లర్లు వేస్తారు. వాటిపై మెట్రో కారిడార్‌ను నిర్మిస్తారు.
రూ.485 కోట్లు అవసరం : మెట్రో ప్రాజెక్ట్‌కు భూసేకరణ కోసం సుమారు రూ.485 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు వేస్తున్నారు. భూసేకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.300 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు సరిపోవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా బ్యాంకుల నుంచి రూ.1,800కోట్లు రుణం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి నుంచి వ్యతిరేకత : మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు మొదటి నుంచి అడ్డంకులు ఎదురువుతున్నాయి. విజయవాడతోపాటు నగర పరిసర ప్రాంతాల్లో విలువైన భూములను ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు. మెట్రోకు భూములు తీసుకునేందుకు 2016, జూలై, ఆగస్టు నెలల్లో రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండుసార్లు చర్చలు జరిపినా... సమస్య కొలిక్కిరాకపోవడంతో ప్రస్తుత కలెక్టర్ లక్ష్మీకాంతం భూ సేకరణకు ప్రాథమిక నోటిపికేషన్ విడుదల చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని భూ యజమానులు ప్రకటించారు.
అంతా ఏకపక్షమే...!
మెట్రో ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు, భూ యజమానులు ఆరోపిస్తున్నారు. తొలుత ప్రతిపాదించిన ఎలైన్‌మెంట్‌ను మార్చివేసి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా కొత్త రూట్ మ్యాప్ ఖరారు చేశారని విమర్శస్తున్నారు. నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా రైవస్, బందరు కాలువల్లో పిల్లర్లు వేసి మెట్రో కారిడార్ నిర్మించాలనే ఒక ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినా... అధికారులు పట్టించుకోలేదు. భవిష్యత్‌లో మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పోడిగించే అవకాశం ఉన్నందున, అక్కడ మెట్రో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, లేదా ప్రభుత్వ భూములు ఉన్న చోట నిర్మించాలనే రైతుల ప్రతిపాదనను అధికారులు కొట్టిపారేశారు.