- బాలుర విభాగంలో తూర్పు గోదావరి విజయం
- మూడో స్థానమూ దక్కించుకోలేకపోయిన ఆతిథ్య జట్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ :
రాష్ట్రస్థాయి మూడవ జూనియర్స్ బాలికల బాస్కెట్‌బాల్ విజేతగా గుంటూరు జట్టు నిలిచింది. అనంతపురం ఇండోర్ స్టేడియంలో సోమవారం గుంటూరు, తూర్పు గోదావరి జట్లు ఫైనల్స్ ఆడాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగింది. రెండవ సెషన్‌లో గుంటూరు జట్టు దూకుడుగా ఆడి విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు స్కోరు 52 కాగా, తూర్పుగోదావరి జట్టు 38. గుంటూరు జట్టులో ఉమ 24, ఎస్తేరు 15 బాస్కెట్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
మూడవ స్థానం కోసం అనంతపురం, కృష్ణ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆతిథ్య జట్టు గెలుస్తుందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు భావించినప్పటికీ, చివర్లో కృష్ణ జట్టు క్రీడాకారులు దూకుడు ప్రదర్శించి 4 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. అనంత జట్టు స్కోరు 32కాగా, కృష్ణ జట్టు 36 పాయింట్లు సాధించింది. సెమీస్‌లో అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా గుంటూరు జట్టు అనంతను ఓడించి ఫైనల్ చేరింది. మరో సెమీస్‌లో కృష్ణ, తూర్పుగోదావరి జట్లు తలపడగా కృష్ణ జట్టును ఓడించి తూర్పుగోదావరి జట్టు ఫైనల్‌కు చేరింది.
- బాలుర విజేతగా తూర్పుగోదావరి జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి, విశాఖపట్టణం జట్లు తలపడ్డాయి. తూర్పుగోదావరి జట్టు 48 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. జట్టులో అహమ్మద్ 20 బాస్కెట్లు వేసి విజయంలో కీలకంగా మారాడు. విశాఖపట్టణం జట్టు 34 పాయింట్లతో రెండవ స్థానాన్ని నిలుపుకొంది.
మూడవ స్థానం కోసం అనంతపురం, గుంటూరు జట్లు తలపడగా అనంత జట్టు గుంటూరు చేతిలో ఓటమిని చవిచూసింది. ముందుగా సెమీస్‌లో అనంతపురం, విశాఖపట్టణం జట్లు తలపడగా విశాఖ జట్టు అనంతను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీస్‌లో తూర్పుగోదావరి, గుంటూరు జట్లు తలపడగా తూర్పుగోదావరి జట్టు గుంటూరును ఓడించి ఫైనల్‌కు చేరింది.
క్రీడలతో ఆరోగ్యం : డీఎస్పీ
క్రీడలతో ఆరోగ్యం బాగుంటుందని డీఎస్పీ మల్లికార్జున వర్మ అన్నారు. సోమవారం రాత్రి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన, లేడీస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అరుంధతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని వర్గాలవారు ఏదో క్రీడలో ప్రాతినిథ్యం వహించడం చాలా అవసరమన్నారు. మంచి క్రీడాకారులంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు శ్రీకాంత్‌రెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నరేంద్ర చౌదరి, కోచ్‌లు జగన్నాథరెడ్డి, వెంకటేష్, నరేంద్ర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.