బస్తీమిత్రతో పెద్దమ్మగడ్డ అభివృద్ధి
-
మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు
-
నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
వరంగల్ : బస్తీమిత్రతో నగరంలోని పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా కమిషనరేట్ పరిధిలో అభివృద్ధికి నోచుకోని 33 బస్తీలను గుర్తించి అక్కడ మౌలిక వసతులతో యువతకు ఉపాధి కల్పించేందుకే ‘బస్తీమిత్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పెద్దమ్మగడ్డలోని డ్రీమ్‌ల్యాండ్ గార్డెన్స్‌లో బుధవారం ‘బస్తీమిత్ర’ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చనే ఆలోచనలతో బస్తీమిత్రను రూపొందించామన్నారు. జిల్లాలోని ప్రైవేటు సంస్థల సహకారంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా నిరుద్యోగులకు జాబ్‌మేళా ఏర్పా టు చేసినట్లు తెలిపారు. స్థానిక పోలీసు అధికారులు బస్తీల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. స్థానికులను చైతన్యవంతులుగా తీర్చిదిద్ది అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్నారు. యువత మెళకువలు పెంపొందించుకునేందుకు బస్తీల్లో లైబ్రరీలు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బస్తీమిత్రలో భాగంగా ప్రతి బస్తీలో యువత, మహిళ, సీనియర్ సిటీజన్, ఉద్యోగుల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. నేర రహిత బస్తీగా పెద్దమ్మగడ్డను తీర్చిదిద్దేందుకు బస్తీమిత్ర కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. కాగా, జాబ్‌మేళాకు హాజరైన పెద్దమ్మగడ్డ యువకులకు క్రీడా సామగ్రితో పాటు ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం పెద్దమ్మగడ్డకు చెందిన పాస్టర్ పేర్ల చరణ్‌పాల్ తదితరులు సీపీని సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బోడ డిన్నా, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, ఈశ్వర్‌రావు, రవీం దర్‌రావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.