అభివృద్ధిలో ముందుంటాం.. | Munduntam development .. | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ముందుంటాం..

Published Mon, Aug 15 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

అభివృద్ధిలో ముందుంటాం..

అభివృద్ధిలో ముందుంటాం..

  • ట్రాఫిక్‌ నియంత్రణకు రింగ్‌ రోడ్డు
  • పాలేరుకు భక్త రామదాసు నీళ్లు
  • 2017 జూన్‌ నుంచి ఇంటింటికీ తాగునీరు
  • కొత్తగా 238 కిలోమీటర్ల నేషనల్‌ హైవే
  • స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి తుమ్మల
  • సాక్షిప్రతినిధి, ఖమ్మం : బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ముందుంచుతామన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ శాఖల శకటాల ప్రగతిని వీక్షించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, లబ్ధిదారులకు పలు పథకాల యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తుమ్మల ప్రసంగించారు. 
    రింగ్‌ రోడ్డుకు రూ.209 కోట్లు
    నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సీఎం కేసీఆర్‌ ఖమ్మం చుట్టూ రింగ్‌ రోడ్డు మంజూరు చేశారు. సుమారు 41 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు నిర్మాణానికి సర్వే పనులు జరుగుతున్నాయి. అలైన్‌మెంట్, భూ సమీకరణ కోసం రూ.209కోట్లు మంజూరు చేశారు.
    హరితహారంలో జిల్లా ప్రథమం
    హరితహారంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 3.50 కోట్ల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేసి.. మరో 50 లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం అడవులను.. 33 శాతం వరకు పెంచేందుకు కృషి చేస్తున్నాం. దీనికోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 
    ‘మిషన్‌’ పరుగులు
    మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో 4,571 చెరువుల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాం. మొదటి దశలో రూ.244.11కోట్ల అంచనా విలువతో 833 చెరువులను అభివృద్ధి చేసేందుకు పనులు చేపట్టగా.. ఇప్పటివరకు రూ.127.56కోట్లు ఖర్చు చేసి 812 చెరువు పనులను పూర్తి చేసి.. 416.97 మి.ఘనపుటడుగుల నీటì  సామర్థ్యాన్ని పునరుద్ధరించాం. రెండో దశలో రూ.319.90కోట్ల అంచనా వ్యయంతో 921 చెరువుల్లో పనులు చేపట్టగా.. ఇప్పటివరకు రూ.43.72కోట్ల వ్యయంతో 229 పనులు పూర్తి చేయగా.. దీనిద్వారా 288.42. మి.ఘనపుటడుగుల నీటి సామర్థ్యం పునరుద్ధరించాం. 
    అక్టోబర్‌లో భక్త రామదాసు నీళ్లు
    జిల్లాలో మెట్ట ప్రాంతమైన తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో 58,958 ఎకరాల ఆయకట్టు అభివృద్ధికి ఏర్పాటు చేసిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–60 కాలువకు టైలెండ్‌ వల్ల సాగునీరందక రైతాంగం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రూ.91కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాం. ప్రాజెక్టుకు కావాల్సిన 33 కిలోమీటర్ల లైనుకు.. 17 కిలోమీటర్ల లైను పూర్తయింది. మిగిలిన పనులన్నీ అక్టోబర్‌ మాసాంతంలోగా పూర్తి చేసి.. ఈ ఏడాదిలోగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తాం. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 40 కిలోమీటర్ల మేర డిజైన్, అంచనాలు తయారయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. 
    2017లో ‘భగీరథ’ నీరు
    2017 జూన్‌ నాటికి జిల్లాలో 326 ఆవాసాలకు, డిసెంబర్‌ వరకు 681, 2018 జూన్‌ వరకు 911 ఆవాసాలకు మంచినీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.572.22కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నాగార్జున సాగర్‌ ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాం. సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో మరమ్మతులకు గురైన 17 ఎత్తిపోతలు, ఏజెన్సీలో 41 ఎత్తిపోతల పథకాలకు రూ.48.30కోట్లు కేటాయించాం. వాటి మరమ్మతులు పూర్తయితే ఈ ఖరీఫ్‌లోనే సాగునీరందుతుంది. అలాగే నూతనంగా ఏజెన్సీలో రూ.1149కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాలను చేపడతాం. 
    రోడ్‌ నెట్‌ వర్కింగ్‌లో జిల్లా అగ్రస్థానం
    జిల్లాలో రూ.1440కోట్లతో 1350 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. వంతెనల నిర్మాణానికి రూ.194కోట్లు కేటాయించాం. కోదాడ, ఖమ్మం, మహబూబాబాద్‌ జాతీయ రహదారి పనులకు డీపీఆర్‌ అందజేశాం. సూర్యాపేట–ఖమ్మం, అశ్వారావుపేట–వరంగల్‌–ఖమ్మం, సారపాక, ఏటూరునాగారం, కౌతాల రహదారులను కేంద్రం జాతీయ రహదారులుగా ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన జాతీయ రహదారుల ప్రాజెక్టులో జిల్లాలో 238 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే జిల్లా రోడ్డు నెట్‌ వర్కింగ్‌లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది. 
    ఉపాధికి రూ.113కోట్ల ఖర్చు
    ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం రూ.113కోట్లు ఖర్చు చేసి.. 81 లక్షల పనిదినాలు కల్పించి.. జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రానున్న నెల రోజుల్లో 2.30లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వచ్ఛ భారత్‌ వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమంలో 9,700 మరుగుదొడ్లు నిర్మించాం. ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంక్షేమ రంగం కింద నిరుపేద విద్యార్థులకు రూ.74.15కోట్లు పంపిణీ చేశాం.
    95 గ్రామ పంచాయతీలకు భవనాలు
    జిల్లాలో 95 గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించనున్నాం. హరితహారం కింద 671 గ్రామ పంచాయతీల్లో 1.57 లక్షల మొక్కలు నాటాం. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, వికలాంగుల సంక్షేమ, స్వచ్ఛ భారత్‌ మిషన్, నెడ్‌క్యాప్, ఆరోగ్యశ్రీ, గిరిజన క్రాంతిపథకం, బ్యాంక్‌ లింకేజీలతో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి కల్పించాం. 
    వేడుకల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కలెక్టర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్‌ ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, బానోతు మదన్‌లాల్, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్, నేతలు పోట్ల నాగేశ్వరరావు, షేక్‌ బుడాన్‌ బేగ్, కొండబాల కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement