సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ రామ్మోహన్
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్త గుర్తింపు లభించేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్‌బీ స్టేడియంలో అక్టోబర్ 8న భారీ స్థాయిలో బతుకమ్మ పండుగ చేసేందుకు గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాల బృందాల సమాఖ్య ప్రతినిధులతో గురువారం జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇందులో మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటక సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ భాస్కరాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఎల్‌బీ స్టేడియంలో 20 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడతారని అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.
దాదాపు 50వేల మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. ఈ వేడుకలో 500 మంది విదేశీ మహిళలు కూడా పాల్గొనడం ప్రత్యేకత అని మేయర్ తెలిపారు. ఇక్కడ జరిగే బతుకమ్మ పండుగతో నగరానికి గుర్తింపుతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది పండుగకు 50వేల మంది విదేశీయులు ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా పుట్టిల ప్రదర్శన..
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అక్టోబర్ 9న మహిళలు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా బతుకమ్మ ఆడతారని, ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలి పారు. అదేరోజు రాత్రి హుస్సేన్‌సాగర్‌లో 300 పుట్టిల ప్రదర్శన ఉంటుందన్నారు. విద్యుత్ కాంతుల వర్ణాలతో పుట్టిల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ అన్నారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ వంటకాలతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.