బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
తవ్వకాలను అడ్డుకొని తీరుతాం
ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతిజ్ఞ
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దార్ అని బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించింది. విశాఖపట్నంలోని గిరిజన భవన్‌లో ఆదివారం కమిటీ సదస్సు జరిగింది. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. గిరిజనుల గోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు వినిపించడం లేదా? పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతానికి వెళ్లి మీకు నేనున్నానంటూ అక్కడి రైతులకు భరోసా ఇచ్చిన పవన్ కల్యాణ్ తీరా వారి భూములను ప్రభుత్వం లాక్కుంటున్నప్పుడు మాత్రం పత్తా లేకుండాపోయారని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు రక్షణ కల్పిస్తామని డీజీపీ రాముడు చెబుతున్నారని, ఎన్ని బలగాలను దించినా తమ 11 మండలాల్లోని గిరిజనులు ఒక్కొక్కరూ ఒక్కో సైనికుడై ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 2న చింతపల్లిలో పర్యటించి, బహిరంగ సభలో పాల్గొంటారని ఈశ్వరి ప్రకటించారు.
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని, అధికారంలో లేనప్పుడు బాక్సైట్‌ను వ్యతిరేకించిన ఆయన అధికారంలోకి వచ్చాక తవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు బీజం పడిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఒక్క జీఓ కూడా జారీ చేయలేదని గుర్తుచేశారు. బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర గవర్నర్ నోరు మెదపక పోవడం దారుణమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న వాటిని ఆయన అడ్డుకోవాలని కోరారు.