అణచివేత యత్నాన్ని ఐక్యంగా తిప్పికొడదాం
అణచివేత యత్నాన్ని ఐక్యంగా తిప్పికొడదాం
Published Thu, Mar 16 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
-మంజునాథ కమిషన్‌కు మన గళాన్ని వినిపిద్దాం
-జిల్లా బీసీ సంఘాల జేఏసీ సమావేశంలో నేతల పిలుపు
రావులపాలెం : ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వాలు బీసీలను అణదొక్కాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కాపులను బీసీల్లో చే ర్చేందుకు వేసిన మంజునాథ కమిషన్ వద్దకు జిల్లాలోని నలుమూల నుంచి లక్షలాదిగా తరలివచ్చి ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని జిల్లా బీసీ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. బుధవారం రావులపాలెంలోని కోనసీమ వర్తక సంఘ కల్యాణ మండపంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రారావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ కులాల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో 70 ఏళ్లుగా బీసీలు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీ జాబితాలో కాపులను చేర్చే ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ నెల 22న కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌కు బీసీల సమస్యలను, కాపులను చేర్చడం వల్ల కలిగే నష్టాలను సమగ్రంగా వివరించేందుకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీలు తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతుండటం సమంజసం కాదన్నారు. గ్రామాల్లోకి వెళ్ళి మైక్ ద్వారా ప్రచారం చేసుకునే ప్రయత్నాలకు పోలీస్‌శాఖ ద్వారా అవాంతరాలు కల్పిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటన వాయిదా వేసి 12 జిల్లాల్లో ముగిశాక ఆఖరిగా ఇక్కడ పర్యటిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలు ఐక్యతను చూపేందుకు సంసిద్ధులుగా ఉండాలన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడంపై వ్యతిరేకతను కాపుల కవ్వింపు చర్యలను లెక్క చేయకుండా శాంతియుతంగా మంజునాథ కమిషన్‌కు వినిపించాలన్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీల్లో అభివృద్ధి చెందిన కాపులను చేర్చడం అన్యాయమన్నారు. కొత్తపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం మండలం అధ్యక్షుడు ఇళ్ళ సతీష్ మాట్లాడుతూ ఇప్పటికే కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఎంపికలో బీసీలు అన్యాయానికి గురయ్యారన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే వార్డు మెంబరు నుంచి ఉన్నత పదవుల వరకూ బీసీలు అణగదొక్కబడతారని కమిషన్‌కు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మరుకుర్తి దుర్గాయాదవ్, జిల్లా గౌడ శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ తులసి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అప్పారి విజయకుమార్, గుబ్బల వీర్రాజు, గుబ్బల సుబ్రహ్మణ్యం, కడలి ఈశ్వరీ, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
Advertisement