బన్ని ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో సమీక్షాసమావేశంలో ఆదోని ఆర్డీవో, డీఎస్పీ
హోళగుంద : దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదోని ఆర్డీ ఓబులేశు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు సూచించారు. ఆదివారం దేవరగట్టులో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 11న జరిగే బన్ని ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడానికి కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డీఎల్పీఓ ఎలిసాకు ఆర్డీఓ సూచించారు. ఉత్సవాల విజయవంతానికి ఉపాధి మేటీలను వలంటీర్లుగా నియమించాలన్నారు. నాటుసారా విక్రయం జరగకుండా ఎక్సైజ్ అధికారులు ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. హెల్త్ క్యాంప్‌లో అన్నిరకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఏఎస్పీ ఫియాజుద్ధీన్, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ నాగేశ్వరరావు, సీఐ శంకరయ్య, ఎస్‌ఐలు మారుతి, ధనుంజయ, కృష్ణమూర్తి, వలి తదితరులు పాల్గొన్నారు.