పనిచెప్పక.. పొమ్మనక..పస్తులుంచుతున్నారు
పనిచెప్పక.. పొమ్మనక..పస్తులుంచుతున్నారు
Published Thu, Jul 6 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
త్రిశంకు స్వర్గంలో బీరు ఫ్యాక్టరీ కార్మికులు
ఉపాధి లేక వీధిన పడుతున్న వైనం
రామచంద్రపురం: కంపెనీలో కార్మికులకు పని చెప్పరు.. అలాగని పొమ్మనరు.. జీతాలివ్వక పస్తులుంచుతున్నారు. ఇదీ పట్టణంలోని ఆర్టోస్ బ్రూవరీస్ (బీరు ఫ్యాక్టరీ) పరిస్థితి. 50 ఏళ్లుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన బీరు ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతపడింది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కానీ ఫ్యాక్టరీ పెట్టినప్పచీ నుంచి పనిచేస్తున్న 35 మంది కార్మికులు ఇప్పటికీ ఫ్యాక్టరీనే నమ్ముకుని ఉన్నారు. ప్రత్యక్షంగా 200 మంది కార్మికులు ఫ్యాక్టరీ పనిచేసే సమయంలో ఉంటే ఎన్‌ఎంఆర్‌లుగా మరో 500 మంది వరకూ ఉపాధి పొందేవారు. ప్రతీరోజు సుమారు 1.75 లక్షల బీరు సీసాలు తయారు చేయగల సామర్థ్యం ఈ ఫ్యాక్టరీది. రాష్ట్ర విభజనానంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థంలో ఒక ఫ్యాక్టరీ ఉంటే రెండవ ఫ్యాక్టరీ ఇదే ఏపీలో ఉన్న రెండింటిలో ఒకటి రామచంద్రపురానికి చెందిన ఆర్టీస్ బ్రూవరీస్ కావడం గమనార్హం. ఇక్కడ తయారయ్యే గోల్డెన్ ఈగల్ బీరు అప్పట్లో దేశవ్యాప్త ప్రాచుర్యం పొందింది. కారణం తెలియదు గానీ, ఏడాదిన్నరగా ఇక్కడ బీరు సీసాల తయారీ నిలిపివేశారు. ఇక్కడ తయారు చేసిన సుమారు 3.5 లక్షల వేల బీరు సీసాలను గత ఏడాదిన్నరగా ఉంచేశారని కార్మికులు చెబుతున్నారు. దీంతో ఎన్‌ఎంఆర్‌లతో పాటుగా కాంట్రాక్టుపై పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. ట్రాన్స్‌పోర్టు మీద ఆధారపడి జీవించే లారీల యజమానులు, డ్రైవర్లు అప్పులపాలయ్యారు. సుమారు 600 మంది వరకు ఉపాధి లేక జీవనోపాధి కోల్పోయారు. ఇక మిగిలింది గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న 35 మంది కార్మికులు ఉన్నారు. వీరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు. పాత బకాయిలతో కలిపి ఒకొక్కరికీ సుమారు రూ.1.50లక్షల వరకు కంపెనీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ర్టీషియన్ పెండ్యాల శ్రీనివాసరావు తన చావుకు కారణం యాజమాన్యమే నంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడడంతో మిగిలినవారిలో ఆందోళన నెలకొంది. మరిన్ని కుటుంబాలు వీధిని పడకుండా చూడాలని యాజమాన్యాన్ని వారు వేడుకుంటున్నారు.
పస్తులుంటున్నాము
కంపెనీలో 30 ఏళ్లుగా బాయిలర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవటంతో కుటుంబాన్ని పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
- కె భూపతి, బాయిలర్ ఆపరేటర్.
అలవెన్సులు బకాయిలున్నాయి
28 ఏళ్లుగా పనిచేస్తున్నాను. రెండేళ్ల అలవెన్సులు రావాల్సి ఉంది. కానీ యాజమాన్యం స్పందన లేదు. కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలి.
కేఆర్‌వీవీ సత్యనారాయణ, రిఫ్రిజిరేటర్ సెక్షన్.
కార్మికులు భయపడుతున్నారు
32 ఏళ్లుగా పనిచేస్తున్నాను. యాజమాన్యం తీరుతో అందరూ ఆందోళనగా ఉన్నారు. జీతాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్నాం. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించాలి.
- ఎంవీ రాజు, వాషింగ్ ఆపరేటర్
Advertisement