
హామీలను నమ్మి మోసపోయాం
బి. కోడూరు: చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసి మోసపోయామని స్థానిక ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త వెంకటసుబ్బయ్య ఎదుట మొరపెట్టుకున్నారు. బుధవారం మండలంలోని మేకవారిపల్లె, మేకవారిపల్లె పాతూరు, రెండు ఎస్సీకాలనీలు, శ్రీరామ్‌నగర్ గ్రామాల్లో గడపకు గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల ఎదుట గ్రామాల్లోలోని ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. టీడీపీ ఎన్నికలకు పక్కా ఇళ్లు , వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, ఉచిత విద్యుత్తును అందిస్తామని చంద్రబాబు చెప్పిన హామీలను నమ్మి నిలువునా మోసపోయామన్నారు. బంగారుపై తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయకపోవడంతో బంగారును వేలం వేసుకునే పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయకర్త వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎంతసేపు టీడీపీ ప్రభుత్వం వారి కార్యకర్తల లబ్ధికోసం పనిచేస్తోంది తప్ప సామాన్య ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ వై.యోగానందరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచు పీ.లక్ష్మీనరసారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు ఎస్.బాలసుబ్బారెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ గంటాసుబ్బిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పీ.వెంకటసుబ్బారెడ్డి, మాధవరెడ్డి, ప్రహల్లాదరెడ్డి, ఎరుకలయ్య, డి.చెన్నయ్య, శేఖర్, నారాయణ, కిట్టయ్య, పీ.జయపాల్, డి.జయరామ్, తిరుపాలయ్య, తదితరులు పాల్గొన్నారు.