
వడ్డీలు కట్టలేక సస్తాన్నాం
కడప కార్పొరేషన్:
‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వస్తానే మాఫీ చేస్తారేమోనని అనుకున్నాం. యాడ చేశారు సార్.. రుణాలు మాఫీకాక.. వడ్డీలు కట్టలేక సస్తాన్నం’ అంటూ మహిళలు వాపోయారు. శుక్రవారం స్థానిక 9వ డివిజన్‌లో గడప గడపకూ వైఎస్‌ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మేయర్, ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒనగూరుతున్నSలబ్ధి ఏమిటో తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు కొత్తగా పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కాగృహాలు, రుణాలేమైనా వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. దీనికి వారు స్పందిస్తూ తమకు ఎలాంటి పథకాలు అందలేదని కుండబద్దలు కొట్టారు. అనంతరం మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు 600 హామీలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీకి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి మల్లికార్జున కిరణ్, నాయకులు ఆర్ ఎన్ బాబు, మురళీ, సీహెచ్ వినోద్, నాగేంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నాగమల్లారెడ్డి, శ్రీరంజన్, పత్తిరాజేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, బోలా పద్మావతి, రత్నకుమారి పాల్గొన్నారు.