ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా
- జన చైతన్య యాత్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
- దానివల్ల రాష్ట్రానికి పారిశ్రామిక రారుుతీలేవీ రావు
- హోదాతో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని నిరూపిస్తే దేనికై నా సిద్ధం
- హోదా కంటే మెరుగైనది కాబట్టే ప్యాకేజీని తీసుకుంటున్నాం
- ‘సైకిల్’ను మర్చిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయ్
సాక్షి, విశాఖపట్నం: ‘‘కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయినా హోదా వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. అందరూ చెబుతున్నట్టు పారిశ్రామిక రారుుతీలేమీ రావు. హోదా వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని నిరూపిస్తే దేనికై నా సిద్ధం. హోదా కంటే మెరుగైనది కాబట్టే ప్యాకేజీని తీసుకుంటున్నాం’’ అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జన చైతన్య యాత్రలో భాగంగా గురువారం విశాఖ జిల్లా చోడవరంలో కొత్తూరు జంక్షన్ నుంచి జూనియర్ కళాశాల వరకు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో టీడీపీ విసృ్తతస్థారుు సమావేశం పేరిట నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నాను. బాబు రాకపోతే ఉన్న జాబులు ఊడిపోరుు ఉండేవి. నేడు ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే అదంతా నా చలవే’’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
ఇకపై కార్యకర్తల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తును మీరంతా మర్చిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీని ఆదరించకపోతే మీరే ఇబ్బందుల్లో పడతారని, సైకిల్‌ను మర్చిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలను హెచ్చరించారు. దేశశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ప్రజలు మాత్రం ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి టీడీపీని విస్మరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని, ఇకపై ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారి ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల కోసం 15 సూత్రాల కార్యక్రమం, కార్యకర్తల సంక్షేమం కోసం నవ సూత్రావళి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు.
పెద్ద నోట్లేవీ ఉండకూడదు
‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవి తాత్కాలికమే. బ్లాక్‌మనీ, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయాలంటే పెద్ద నోట్లను రద్దు చేయక తప్పదు. రద్దు చేయాలని కోరింది కూడా నేనే. ఇప్పుడు కొత్తగా రూ.2,000 నోటు తీసుకురావడం సైతం సరైంది కాదు. దాన్ని కూడా రద్దు చేయాలి. పెద్ద నోట్లేవీ ఉండకూడదు. రూ.100, రూ.50 నోట్లను రాష్ట్రానికి ఎక్కువగా పంపాలని కోరాం. ముద్రణలో ఎన్నో ఇబ్బందులున్నాయని ఆర్‌బీఐ చెప్పింది. చిన్న నోట్లు వచ్చే వరకూ ఈ కష్టాలు తప్పవు. ప్రతి ఒక్కరూ రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపేలా అలవాటు చేసుకోవాలి. ఇకపై పింఛన్లు, ఉపాధి హామీ పథకం వేతనాలు, సంక్షేమ పథకాల ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళావెంకట్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మరి అప్పుడేమన్నారు?
‘‘అడ్డగోలు విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోరుుంది. ఈ గాయం మానాలంటే రాష్ట్రానికి కచ్చితంగా 15 ఏళ్లు ప్రత్యేక హోదా ప్రకటించాలి. హోదా తో ఎన్నో ప్రయోజనాలు ఉంటారుు. యూపీఏ సర్కారు చెబుతున్నట్లు హోదా ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. హోదా ఐదేళ్లే ఉంటే వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చరుునా 15 ఏళ్లు ప్రత్యేక హోదా సాధిస్తాం. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తాం’’
- గతంలో వివిధ సందర్భాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు
‘‘ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం ఐదేళ్లే ప్రత్యేక హోదా ప్రకటించి అన్యాయం చేసింది. కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం’’
- గతంలో కేంద్ర మంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు