క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
-
ఎమ్మెల్సీ బోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
కాకినాడ సిటీ :
బస్సు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వైద్యులను కోరారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, నాయకులు కోమలి సత్యనారాయణ, విత్తనాల రమణ, కడియాల చిన్నబాబు తదితరులు ఉన్నారు.
కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ
క్షతగాత్రులను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. వీరికి అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని, వీరికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాయపడిన 12 మందిలో ముగ్గురిని డిశ్చార్జి చేశారని, మిగిలిన 9 మంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆలీం బాషా, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్ ఉన్నారు.